Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత…

సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత…

  • ఇటీవల కరోనా బారినపడిన శివశంకర్ మాస్టర్
  • హైదరాబాదు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
  • పరిస్థితి విషమించడంతో మృత్యువాత
  • దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నింపుతూ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు వచ్చాయి.

తమిళ హీరో ధనుష్, బాలీవుడ్ నటుడు సోనూ సూద్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వంటివారు శివశంకర్ మాస్టర్ చికిత్స కోసం విరాళాలు కూడా అందజేశారు. అటు అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా శివశంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే అందరినీ విషాదానికి గురిచేస్తూ శివశంకర్ మాస్టర్ నేడు తుదిశ్వాస విడిచారు. అందరితోనూ సఖ్యతతో మెలిగే శివశంకర్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

అటు శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కూడా కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

శివశంకర్ మాస్టర్ వయసు 72 సంవత్సరాలు. 1975 నుంచి ఆయన సినీ రంగంలో కొనసాగుతున్నారు. 10 భాషల్లో 800కి పైగా చిత్రాల్లో పాటలకు కొరియోగ్రఫీ అందించారు. నటుడిగానూ ఆయన పలు చిత్రాల్లో కనిపించారు. టెలివిజన్ రంగంలోనూ ప్రేక్షకులను అలరించారు.

 

ఖైదీ’ చిత్రం నుంచి శివశంకర్ మాస్టర్ తో నా స్నేహం మొదలైంది; చిరంజీవి

దిగ్భ్రాంతికి గురైన చిరంజీవి…ఆత్మీయుడ్ని కోల్పోయానని ఆవేదన

Chiranjeevi reacts after Shivshankar Master demise
ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా కారణంగా కన్నుమూశారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఓ ఆత్మీయుడ్ని కోల్పోయానంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఖైదీ’ సినిమా నుంచి ఆయనతో స్నేహం మొదలైందని, ఆ తర్వాత ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశామని వెల్లడించారు. శివశంకర్ మాస్టర్ మరణం నృత్య రంగానికి, చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చిరంజీవి పేర్కొన్నారు. చివరిసారి తామిద్దరం కలుసుకున్నది ‘ఆచార్య’ సెట్స్ పైన అని వెల్లడించారు. ఆయన కుటుంబానికి ఈ కష్టకాలంలో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

ఇక సోనూ సూద్ స్పందిస్తూ, శివశంకర్ మాస్టర్ ను కాపాడుకునేందుకు శక్తిమేర కృషి చేశామని, కానీ దేవుడు మరోలా నిర్ణయించాడని వ్యాఖ్యానించారు. ఆయన మరణవార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు.

బాధాకరమైన విషయం ఏమిటంటే… శివశంకర్ మాస్టర్ కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ మరణించారు. చనిపోవడానికి ముందు ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చిందని ఏఐజీ వైద్యులు వెల్లడించారు.

శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. హైదరాబాదులోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

Related posts

తమ వాడిని వదిలేయాలంటూ కోల్‌కతా న్యాయమూర్తికి లంచం ఇచ్చే యత్నం.. ఇద్దరు హైదరాబాదీల అరెస్ట్

Drukpadam

కరోనా మాటున మోడీ ప్రభుత్వంపెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గం

Drukpadam

Drukpadam

Leave a Comment