సాగు చట్టాల రద్దుకు లోక్‌సభ ఆమోదం.. అయినా రైతుల ఆందోళనలు కొనసాగింపు: టికాయత్!
- నిరసనలు, ప్రదర్శనలు జరగకూడదని కేంద్రం భావిస్తోంది
- కనీస మద్దతు ధరతో పాటు మా ఇతర డిమాండ్లు నెరవేరాలి
- వాటిపై చర్చించే వరకు మేము ఆందోళన కొనసాగిస్తాం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాల రద్దుకు లోక్‌సభ ఈ రోజు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది నుంచి తాము చేస్తోన్న పోరాటానికి ప్రతిఫలం దక్కిందని చెబుతున్నారు. అయితే, ఇతర డిమాండ్లూ నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.
‘దేశంలో నిరసనలు ప్రదర్శనలు ఏవీ జరగకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, కనీస మద్దతు ధరతో పాటు మా ఇతర డిమాండ్లపై ఇప్పటికీ చర్చించలేదు. వాటిపై చర్చించే వరకు మేము ఆందోళన కొనసాగిస్తాం. కొత్త సాగు చట్టాల రద్దు కోసం ఆందోళనల్లో పాల్గొని 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు లోక్‌సభలో సాగుచట్టాల రద్దు బిల్లు ఆమోదం పొందడంతో ఆ రైతులకు దాని ద్వారా నివాళులు అర్పించినట్లు అయింది. కనీస మద్దతు ధరతో పాటు ఇతర డిమాండ్లు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి పరిష్కారం దొరికే వరకు మా ఆందోళనలు కొనసాగుతాయి’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు.