వంట సామగ్రి నుంచి.. వాహనాల వరకు అన్నింటి ధరలూ పైపైకే!
- 4-5 శాతం మేర ఎఫ్ఎంసీజీ రేట్ల పెంపు త్వరలో
- ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలపైనా 6-10 అదనపు బాదుడు
- తయారీ, రవాణా వ్యయాలు పెరిగాయంటున్న కంపెనీలు
- ఊరట ఎప్పుడా అని చూస్తున్న సామాన్యుడు
వంటింట్లో నూనె, ఒంటికి రాసుకునే సబ్బు, నట్టింట్లో టీవీ, రవాణా వాహనం.. ఇలా నిత్యజీవితంలో వినియోగించే ప్రతీ ఉత్పత్తి ధర సామాన్యుడికి భారంగా మారుతోంది. తయారీ ముడి పదార్థాల ధరలు పెరిగిపోయాయని చెప్పి.. ఈ వ్యయాలను తాము వినియోగదారులకు బదలాయించక తప్పని పరిస్థితి అంటూ వాహన కంపెనీలు గడిచిన ఏడాది కాలంగా పలు పర్యాయాలు రేట్లను సవరించాయి.
ఎఫ్ఎంసీజీ కంపెనీలు (హిందుస్థాన్ యూనిలీవర్, డాబర్, ఐటీసీ, పీఅండ్ జీ, ఇమామీ తదితరాలు) కూడా ఇప్పటికే రేట్లను పెంచగా.. అవి మరో విడత 4-10 శాతం స్థాయిలో రేట్ల పెంపునకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించాయి. విక్రయాలపై ప్రభావం ఉన్నా కానీ వచ్చే మూడు నెలల్లో రేట్లను పెంచక తప్పదని పేర్కొన్నాయి.
ఉత్పత్తుల రవాణా ఖర్చులు తడిసి మోపెడయ్యాయన్నది ఆయా సంస్థల వాదన. ఇప్పటికే ఉత్పత్తుల బరువును (గ్రాములు) తగ్గించడం ద్వారా రేట్లను పెంచామని, అయినా లాభాల మార్జిన్లు పడిపోయాయని పార్లే అంటోంది. కనుక వచ్చే త్రైమాసికంలో 4-5 శాతం పెంపు ఉంటుందని స్పష్టం చేసింది.
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ (టీవీలు, ఏసీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషిన్లు, ల్యాప్ టాప్ లు, ఫోన్లు) కంపెనీలు కూడా ఇప్పటికే 3-5 శాతం వరకు రేట్లను పెంచాయి. మరో విడత 6-10 శాతం వరకు రేట్లను జనవరిలో పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. 2020 డిసెంబర్ నుంచి తాము ఉత్పత్తుల రేట్లను మూడు సార్లు పెంచామని, మరో విడతతో నాలుగుసార్లు పెంచినట్టు అవుతుందని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమే అంటోంది. ఉత్పత్తుల తయారీలో వినియోగించే స్టీల్, కాపర్, అల్యూమినియం, విడిభాగాల ధరలు 22-23 శాతం వరకు భారమైనట్టు అవి చెబుతున్నాయి. కమోడిటీ, రవాణా చార్జీలు పెరిగిపోవడంతో ఉత్పత్తుల ధరలను పెంచక తప్పదంటోంది ఎల్ జీ ఎలక్ట్రానిక్స్.
గతంలో బొగ్గు, ముడి ఇనుము ధరలు గరిష్ఠాలకు చేరడంతో స్టీల్ కంపెనీలు ధరలను పెంచాయి. దీంతో చాలా పరిశ్రమల్లో స్టీల్ ముడి సరుకుగా ఉండడంతో వాటిపై ప్రభావం పడింది. ఇప్పుడు బొగ్గు, ముడి ఇనుము ధరలు కొంత తగ్గడంతో ఆ ఫలాన్ని తాము పరిశ్రమలకు బదిలీ చేశామని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఎండీ వీఆర్ శర్మ చెప్పారు. కరోనా అనంతరం సరఫరా పరమైన సమస్యలు కూడా ముడి సరుకుల ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి.
అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు పెరగడం రవాణా రంగంపైనా బలమైన ప్రభావాన్ని చూపించింది. దీంతో రవాణా చార్జీలు పెరిగిపోయాయి. ఇది కూడా చాలా పరిశ్రమలపై ప్రభావం చూపిస్తోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కొంతమేర తగ్గించేందుకు కేంద్రం పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సయిజ్ సుంకాలను కొంత తగ్గించినప్పటికీ, దక్కిన ఊరట పెద్దగా లేదు.
మరోపక్క, వంట నూనెల దిగుమతుల సుంకాలను కూడా కేంద్ర సర్కారు గణనీయంగా తగ్గించేసింది. దీంతో రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరికొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కూరగాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. దీంతో ఈ ధరాఘాతం ఉపశమనం ఎప్పుడా అని సామాన్య ప్రజలు వేచి చూస్తున్నారు.