‘విటమిన్ డి తక్కువైతేనే కాదు.. ఎక్కువైనా ప్రమాదమే’ అంటున్న వైద్యనిపుణుడు!
- అధిక మోతాదులో తీసుకుంటే ఫ్రాక్చర్ల రిస్క్
- మూత్రపిండాల్లో రాళ్లు
- బలహీనత, గుండెజబ్బులు
- ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ హెచ్చరిక
విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతో కీలకమైన విటమిన్. ఇది తగినంత లేకపోతే ఆహారంలో భాగంగా వచ్చే క్యాల్షియాన్ని మన శరీరం, ఎముకలు అంతగా గ్రహించలేవు. అంటే డి విటమిన్ వాహకంగా పనిచేస్తుంది. ఎముకలు పటిష్ఠంగా ఉండి, శరీరం దృఢంగా ఉండడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కనుక విటమిన్ డి తక్కువైతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
రోజులో కొంత సమయం ఎండలో గడిపితే కావాల్సినంత డి విటమిన్ సహజ సిద్ధంగా మన శరీరానికి అందుతుంది. ఎండ మొహం చూడని వారు మాత్రల రూపంలో డి విటమిన్ ను శరీరానికి అందించాల్సి ఉంటుంది. కానీ, విటమిన్ డిని అధిక మోతాదులో మాత్రల రూపంలో తీసుకున్నా హాని జరుగుతుందని తెలుసుకోవాలి.
‘‘డి విటమిన్ తక్కువైతే మానసిక అనారోగ్యం, కొంచెం దెబ్బకే ఫ్రాక్చర్లు కావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. మోతాదుకు మించి ఇది శరీరంలోకి చేరితే టాక్సిసిటీకి దారితీస్తుంది. అప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు, తలతిరగడం, మలబద్ధకం, ఎముకలు ఫ్రాక్చర్లకు గురయ్యే ప్రమాదం, గుండె జబ్బులకు దారితీస్తుంది. కొందరిలో కేన్సర్ కు సైతం దారితీసే ప్రమాదం ఉంది’’ అని అంటున్నారు ముంబైలోని గ్లోబల్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ ఆర్చిక్.
రోజుకు 10,000 ఐయూల కంటే ఎక్కువ తీసుకుంటే రక్తంలో క్యాల్షియం స్థాయులు అసాధారణ స్థాయికి చేరి అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరించారు. మోతాదు మించితే అధిక దాహం, తరచూ మూత్ర విసర్జన, అయోమయం, బరువు కోల్పోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయన్నారు.
పాలు, చేపలు, గుడ్లలోని పచ్చసొన, రెడ్ మీట్ తృణ ధాన్యాల్లో విటమిన్ డి లభిస్తుంది. కాకపోతే తగినంత కావాలంటే సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందు ఎండలో ఒక అరగంట గడిపినా చాలు. 31-70 ఏళ్లలోపు వారికి రోజుకు 600 ఐయూలు, 70 ఏళ్లు దాటిన వారికి 800 ఐయూల విటమిన్ డి సరిపోతుందని డాక్టర్ శ్రీధర్ ఆర్చిక్ తెలిపారు.