Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరుపతి విమానాశ్రయానికి నీటిసరఫరా నిలిపివేతపై రగడ!

తిరుపతి విమానాశ్రయానికి నీటిసరఫరా నిలిపివేతపై రగడ!
నీటి సరఫరా నిలిపివేత అంశంపై చర్యలు తీసుకుంటాం: కేంద్రమంత్రి సింథియా
నీటి సరఫరా నిలిపివేస్తారా?: వైసీపీ నేతలపై జీవీఎల్ ఆగ్రహం
రేణిగుంట ఎయిర్ పోర్టుకు నీటి సరఫరా నిలిపివేత అంటూ కథనం
పత్రికా కథనం నేపథ్యంలో ఎంపీ జీవీఎల్ స్పందన
దిగ్భ్రాంతి కలిగిస్తోందంటూ వ్యాఖ్యలు
ఉన్నతస్థాయి విచారణ కోసం కేంద్రానికి లేఖ రాసినట్టు వెల్లడి
లేఖపై స్పందించిన కేంద్రమంత్రి సింథియా
పరిశీలన జరుపుతామని వెల్లడి

రేణిగుంట విమానాశ్రయానికి, సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్స్ కు నీటి సరఫరా నిలిపివేశారంటూ ఓ దినపత్రికలో వచ్చిన కథనంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. నీటి సరఫరా పైప్ లైన్లను కత్తిరించడమే కాకుండా, నీటి ట్యాంకర్లు వెళ్లకుండా రోడ్డును సైతం తవ్వేశారంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. ఇది వైసీపీ నేతల పనే అంటూ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి, సిబ్బంది క్వార్టర్స్ కు వైసీపీ నేతలు నీటి సరఫరా నిలిపివేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రోడ్లు తవ్వేయడం దారుణం. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంశంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు లేఖ రాశాను. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరాను” అంటూ జీవీఎల్ ట్వీట్ చేశారు. అంతేకాదు, తన ట్వీట్ తో పాటు సదరు పత్రికా కథనాన్ని కూడా ఆయన పంచుకున్నారు.

మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందన …చర్యలు తీసుకుంటామని హామీ

తిరుపతి రేణిగుంట విమానాశ్రయంతో పాటు, సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్స్ కు వైసీపీ నేతలు నీటి సరఫరా నిలిపివేశారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్రానికి లేఖ రాయడం తెలిసిందే. జీవీఎల్ లేఖపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. కేంద్రం తరఫున ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు, సిబ్బందికి ఇకపై ఎంతమాత్రం అసౌకర్యం కలగదని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

కాగా, ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా జీవీఎల్ కేంద్రానికి లేఖ రాశారు. ఇటీవల బొత్స సత్యనారాయణ తిరుపతి పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలే ఎయిర్ పోర్టుకు నీటి సరఫరా నిలిపివేతకు దారితీశాయంటూ ఆ పత్రికా కథనంలో పేర్కొన్నారు.

Related posts

‘అమరుడి కొడుకును అవమానించినా కేసులేదు’: ప్రియాంక గాంధీ

Drukpadam

2.8 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన అఖిలేశ్ యాదవ్ అర్ధాంగి డింపుల్!

Drukpadam

గవర్నర్​ తమిళిసైపై సీఎం కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment