హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్ ల వద్ద భారీ మార్పులు తీసుకొస్తున్న అధికారులు!
- వాహనాలతో కిక్కిరిసి పోతున్న హైదరాబాద్ రోడ్లు
- పలు జంక్షన్ల వద్ద పెద్ద సంఖ్యలో నిలిచిపోతున్న వాహనాలు
- ఫ్రీ లెఫ్ట్ అమలు చేసేందుకు సిద్ధమవుతున్న అధికారులు
హైదరాబాదులో అనునిత్యం అనేక వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తున్నాయి. ఉత్తరాది నుంచి నగరానికి వస్తున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. దీంతో, సిటీ జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. రోడ్లు వాహనాలతో కిక్కిరిసి పోతున్నాయి. నగరంలోని కొన్ని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద విపరీతంగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
రద్దీ ఎక్కువగా ఉన్న జంక్షన్ ల వద్ద ఫ్రీ లెఫ్ట్ పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ విధానాన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద అమలు చేస్తున్నారు. ఈ విధానం అక్కడ విజయవంతమవడంతో ఇతర జంక్షన్ల వద్ద కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రవీంద్రభారతి, కంట్రోల్ రూమ్, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. మరో వారం రోజుల్లో రద్దీ జంక్షన్ల వద్ద ట్రయల్స్ నిర్వహిస్తామని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు.