అసమర్థుడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానంటూ చెప్పుతో కొట్టుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు!
- అసమర్థుడైన ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించానన్న కొత్తపల్లి
- ఆయనను గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నానని వ్యాఖ్య
- వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారిన వైనం
మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, నర్సాపురంను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. ఆ ఆందోళన కార్యక్రమానికి సుబ్బారాయుడు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమర్థుడైన ముదునూరి ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని, ఆయనను గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నానంటూ… చెప్పుతో కొట్టుకున్నారు. దీంతో, అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు. మనం ఓట్లేసి గెలిపించిన అభ్యర్థి ప్రజలను మోసం చేస్తున్నాడు కనుక, నర్సాపురంను జిల్లా కేంద్రం కాకుండా చేస్తున్నాడు కనుక, అటువంటి వ్యక్తిని సపోర్ట్ చేశాను కనుక నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నానని ఆయన అన్నారు.
మరోవైపు గత కొంత కాలంగా కొత్తపల్లి సుబ్బారాయుడికి, ఎమ్మెల్యే ప్రసాదరాజుకు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఈరోజు జరిగిన పరిణామాలను చూస్తే అది నిజమే అనిపిస్తోందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామం వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.