అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదు.. టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం
-చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో పొలిట్ బ్యూరో భేటీ
-పొలిట్ బ్యూరో నిర్ణయాన్ని టీడీఎల్పీలో చర్చించాలని నిర్ణయం
-ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించాకే తుది నిర్ణయమన్న పార్టీ
టీడీపీలోని అత్యున్నత నిర్ణాయక విభాగం పొలిట్ బ్యూరో గురువారం నాడు అమరావతిలో సమావేశమైంది. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్న తరుణంలో పార్టీ వ్యూహంపై చర్చించేందుకే ఈ భేటీ జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.
సమావేశంలో భాగంగా త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు పార్టీ సభ్యులు హాజరు కావద్దని పొలిట్ బ్యూరో సభ్యులు నిర్ణయించారు. అయితే ఈ విషయంపై పొలిట్ బ్యూరో నిర్ణయాన్నే ఫైనల్‌గా భావించకుండా.. పొలిట్ బ్యూరో నిర్ణయంపై టీడీపీ శాసనసభాపక్ష భేటీలో ప్రస్తావించాలని పార్టీ నిర్ణయించింది. త్వరలోనే జరగనున్న టీడీఎల్పీ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా? వద్దా? అన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లుగా పార్టీ ప్రకటించింది.