హిజాబ్ లేకుండా కాలేజీకి వెళ్లం.. పిటిషన్ వేసిన ముస్లిం యువతుల సంచలన నిర్ణయం!
- ఉడుపి జిల్లాలో హిజాబ్‌ను అనుమతించని విద్యాలయం
- హైకోర్టును ఆశ్రయించిన ఆరుగురు ముస్లిం యువతులు
- తీర్పుపై బాధిత యువతుల ఆవేదన
- హైకోర్టులో తమకు న్యాయం దక్కలేదని వాదన
- పోరాటాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటన
హిజాబ్ వివాదంలో తమకు న్యాయం దక్కలేదని ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ముస్లిం యువతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కోర్టు తీర్పునకు నిరసనగా తాము హిజాబ్ లేకుండా కాలేజీకి వెళ్లేది లేదని కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హిజాబ్ వివాదంపై మంగళవారం ఉదయం కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పుపై యువతులు కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు.
హిజాబ్‌పై తాము పోరాటం చేసి తీరతామని కూడా ఆ యువతులు ప్రకటించారు. యువతులు ముందుగా హిజాబ్ ధరించాలని, పుస్తకాలను కాదని వారు పునరుద్ఘాటించారు. హిజాబ్ లేకుండా తాము కాలేజీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.
కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని ఓ విద్యాలయం హిజాబ్‌ను అనుమతించని విషయం తెలిసిందే. స్కూల్ యూనిఫామ్ డ్రెస్సులో మాత్రమే విద్యాలయంలోకి అనుమతిస్తామని చెప్పిన సదరు విద్యాలయం హిజాబ్‌తో వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ పాఠశాలకు చెందిన ఆరుగురు ముస్లిం యువతులు పాఠశాలల్లోకి హిజాబ్‌ను అనుమతించాలని పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ఆరుగురిలో ఓ ముగ్గురు యువతులు తాజాగా మీడియా ముందుకు వచ్చారు.