డైలమాలో జగ్గారెడ్డి …పార్టీకి దూరంగా ఉండటమా ? వేరే పార్టీలో చేరడమా ?
సోనియా ,రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తానని వెల్లడి
పదవుల కోత అనంతరం భట్టి, ఉత్తమ్ సహా ఎవరూ నాతో మాట్లాడటం లేదు
నాతో మాట్లాడేందుకు భయపడుతున్నారు
ఢిల్లీకి రావాలని నాకు పిలుపు రాలేదు
పదవుల కోత విషయాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటున్నానన్న జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం ముదురుతోంది. జగ్గారెడ్డి దూకుడుకు బ్రేకులు వేయడంతో కాంగ్రెస్ లో సీన్ మారింది. ఆయన ఇప్పటివరకు చేస్తున్న పదవుల్లో కోత విధించడం తో జగ్గారెడ్డి నిన్న సాయంత్రం వరకు మీడియా కు దూరంగా ఉన్నారు. సాయంత్రం లోకల్ ఛానళ్లతో మాట్లాడారు . తన అనుచరులు , కార్యకర్తలు పార్టీ వీడవద్దని అంటున్నారని అయితే తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు . తనకు భట్టి , ఉత్తమ్ , వి హెచ్ ఇంకా కొంతమంది ఇతర నాయకులు ఫోన్ చేశారని తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారని వారి కోరిక మేరకు రెండుమూడు రోజులు ఆగుతానని చెప్పారు . అయితే ఈ రోజు భట్టి ,ఉత్తమ్ , మిగతా నేతలు ఎవరు తనతో మాట్లాడటం లేదని ,మాట్లాడేందుకు భయపడుతున్నారని అన్నారు . తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని పేర్కొన్నారు. తాను పార్టీ దూరంగా ఉండాలని అనుకుంటున్నానని , ఏపార్టీలోకి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు . తనవల్ల కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని భావిస్తున్నందున దూరంగా ఉండటమే నాకు గాని వాళ్లకు గాని మంచిదని పేర్కొన్నారు . సోనియా ,రాహుల్ నాయకత్వాని సమర్థిస్తానని ఇందులో మరోమాటకు తావులేదని అన్నారు .
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పార్టీలోని కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన అసహనాన్ని పలుమార్లు బహిరంగంగానే వెళ్లగక్కారు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డికి ఉన్న బాధ్యతల్లో కోత విధించారు.
ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ లోక్ సభ స్థానాలతో పాటు మహిళా కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, ఇతర సంఘాల ఇన్ఛార్జి బాధ్యతలను ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ రేవంత్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు తాజా అంశాలపై అధిష్ఠానంతో మాట్లాడేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్లారు.
ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం తనతో భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఎవరూ మాట్లాడటం లేదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనతో మాట్లాడేందుకు భయపడుతున్నారని అన్నారు.
మరోపక్క, ఢిల్లీకి రావాలని తనకు ఇంతవరకు ఎలాంటి పిలుపు రాలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే అనుకుంటున్నానని తెలిపారు. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని తానెప్పుడూ సమర్థిస్తానని చెప్పారు. తప్పు, ఒప్పుల గురించి మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఉంటుందని అన్నారు. పదవుల కోత విషయాన్ని కూడా తాను స్పోర్టివ్ గా తీసుకుంటానని చెప్పారు.
టీపీసీసీలో లుకలుకలు.. ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి.. జగ్గారెడ్డి తీరుపై ఆగ్రహం
టీపీసీసీలో మరోసారి లుకలుకలు బయటపడడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇటీవల తమ పార్టీ అధిష్ఠాన సూచనలను ధిక్కరించి మరీ వీహెచ్, జగ్గారెడ్డి హైదరాబాద్‌లోని అశోక హోటల్‌లో సమావేశం కావడంతో ఇప్పటికే జగ్గారెడ్డిపై ఆ పార్టీ పలు చర్యలు తీసుకుంది. అయినప్పటికీ జగ్గారెడ్డి ఏ మాత్రం తగ్గట్లేదు.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాతి నుంచి ఆయనను లక్ష్యంగా చేసుకుని పలువురు సీనియర్ నేతలు వ్యాఖ్యలు చేస్తుండడంతో రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలో పలువురు సీనియర్ నేతల తీరుపై ఆయన తమ పార్టీ అధిష్ఠానానికి వివరాలు తెలపనున్నారు. ముఖ్యంగా జగ్గారెడ్డి వ్యవహారాన్ని తమ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌తోనూ ఆయన భేటీ కానున్నారు.