ఎంపీ పదవికి అఖిలేష్ గుడ్ బై …అజాం ఖాన్ కూడా!
-కర్తాల్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అఖిలేశ్ నిర్ణయం
-శాసనసభకు ఎన్నికకావడంతో ఎంపీ పదవులు వదులుకున్న నేతలు
-యూపీ శాసనసభలో ప్రతిపక్ష నేతగా అఖిలేష్
-రసకందాయంలో యూపీ అసెంబ్లీ
-మొదటిసారిగా అఖిలేష్ శాసనసభకు ….
-అజాంగఢ్ ఎంపీ స్థానానికి రాజీనామా
-లోక్ సభ స్పీకర్‌కు రాజీనామా సమర్పణ
సమాజావాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తన లోకసభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేశారు. ఇటీవల యూపీ లో జరిగిన ఎన్నికల్లో శాసనసభకు తొలిసారి పోటీచేసిన అఖిలేష్ యూపీ అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు . తొలుత ఎంపీ గానే కొనసాగాలని భావించినప్పటికీ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో అటువైపే మొగ్గు చూపారు . గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అఖిలేష్ మొదటిసారిగా శాసనసభకు ఎన్నికైయ్యారు . ఆయనతోపాటు ఎస్పీ మరో ముఖ్యనేత అజాం ఖాన్ కూడా శాసనసభకు ఎన్నికైనందున లోకసభకు రాజీనామా చేశారు . ఇద్దరు కీలక నేతలు అసెంబ్లీ కి రావడంతో యూపీ రాజకీయాలు రసకందాయకంలో పడతాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మంగళవారంనాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ముగిసిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)… బీజేపీ సీట్లు తగ్గించగలిగినా.. విజయం మాత్రం సాధించలేకపోయింది. దీంతో వరుసగా రెండో సారి బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
అయితే ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా పోటీచేయని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్.. మొన్నటి ఎన్నికల్లో కర్తాల్ అసెంబ్లీ సీటు బరిలోకి దిగి విజయం సాధించారు. ఇకపై ఎమ్మెల్యేగానే కొనసాగేందుకు నిర్ణయించుకున్న అఖిలేశ్.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అజాంగఢ్ నుంచి 2019లో అఖిలేశ్ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు మంగళవారం పార్లమెంటులో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసిన అఖిలేశ్ తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. యూపీకి సీఎంగా కొనసాగిన సమయంలోనూ అఖిలేశ్ ఎమ్మెల్సీగా కొనసాగారు తప్పించి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. తాజాగా తాను తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అఖిలేశ్.. పార్టీ చతికిలబడినా.. తాను మాత్రం విజయం సాధించారు.
ఈ క్రమంలో జాతీయ రాజకీయాలపై కాస్తంత దృష్టి తగ్గించి, రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ పెంచే దిశగా అఖిలేశ్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. దీంతోనే ఆయన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే పదవిలోనే కొనసాగేందుకు ఇష్టపడి అప్పటికే ఉన్న ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంతో ఇకపై యూపీ అసెంబ్లీ సమావేశాల్లో యోగి సర్కారు, ప్రధాన ప్రతిపక్ష హోదాలోని ఎస్పీ మధ్య హోరాహోరీ పోరు సాగనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.