- 28 రోజుల అనంతరం అజ్ఞాతం వీడిన యువతి
- రెండు గంటలపాటు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం
- కోర్టు అనుమతితో రాత్రి వరకు సిట్ విచారణ
- నేడు మళ్లీ హాజరు కావాలని ఆదేశం
కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపిన రాసలీలల సీడీ కేసులోని యువతి ఎట్టకేలకు అజ్ఞాతం వీడింది. దాదాపు 28 రోజులపాటు అజ్ఞాతంలో గడిపిన యువతి నిన్న నాటకీయ పరిణామాల మధ్య బెంగళూరులోని ఏసీఎంఎం కోర్టుకు హాజరైంది. న్యాయమూర్తి బాలగోపాల్ కృష్ణ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధిత యువతి కోర్టులో హాజరు కాబోతోందన్న సమాచారంతో మీడియా ప్రతినిధులు కోర్టు బయట ఎదురు చూశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిన్న మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కోర్టుకు చేరుకున్న యువతి దాదాపు రెండు గంటలపాటు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఆ సమయంలో అక్కడ ఓ స్టెనోగ్రాఫర్ మాత్రమే ఉండగా, ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో ఆమెను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు రాత్రి వరకు విచారించారు. అనంతరం నేడు కూడా విచారణకు రావాలని ఆదేశించారు.