హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనకుంటే భారత్ ఇస్లాం దేశం అవుతుందట: యతి సత్యదేవానంద్ సరస్వతి!
-ఇస్లామిక్ దేశంగా మారకూడదంటే హిందువులు మరింత మందిని కనాలి
-ప్రణాళిక ప్రకారం ముస్లింలు జనాభా పెంచుకుంటున్నారన్న సరస్వతి
-మెజారిటీ సాధిస్తే భారత్ ఇస్లామిక్ దేశం అవుతుందని వ్యాఖ్య
-అందుకే హిందువులు ఎక్కువ మందిని కనాలని సలహా
-అఖిల భారతీయ సంత్ పరిషత్ పిలుపు
భారత్ ఇస్లామిక్ దేశంగా మారకుండా ఉండేందుకు హిందువులు మరింత మంది పిల్లల్ని కనాలంటూ వివాదాస్పద స్వామీజీ యతి నర్సింగానంద్ ఆధ్వర్యంలోని సంస్థ మరోసారి హిమాచల్ ప్రదేశ్ లో పిలుపునిచ్చింది. రానున్న దశాబ్దాల్లో భారత్ హిందువులు తక్కువగా ఉన్న దేశంగా మారకుండా ఉండాలంటే, హిందువులు మరింత మంది పిల్లల్ని కనాలని ఈ నెల మొదట్లోనూ యతి నర్సింగానంద్ ఉత్తరప్రదేశ్ లోని మధుర వేదికగా పిలుపునిచ్చారు.
2021 డిసెంబర్ 17-19 తేదీల మధ్య హరిద్వార్ లో ధర్మ సంసద్ నిర్వహించి, రెచ్చగొట్టే ప్రసంగం చేశారంటూ ఆయనపై లోగడ కేసు నమోదైంది. ఈ కేసులోనే నర్సింగానంద్ అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలయ్యారు.
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లోని ముబారక్ పూర్ లో మూడు రోజుల పాటు ధర్మ సంసద్ జరుగుతోంది. ఈ సందర్భంగా అఖిల భారతీయ సంత్ పరిషత్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ చార్జ్ యతి సత్యదేవానంద్ సరస్వతి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత్ ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు. కానీ, ముస్లింలు ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కువ మందిని కంటూ తమ సంతతి పెంచుకుంటున్నారు. ముస్లింలు మెజారిటీ సాధిస్తే పాకిస్థాన్ మాదిరే భారత్ ఇస్లామిక్ దేశంగా మారుతుంది. దీన్ని నివారించేందుకే హిందువులు మరింత మంది పిల్లల్ని కనాలని తమ సంస్థ కోరుతోంది’’ అన్నారు యతి సరస్వతి.
దీనిపై స్థానిక పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఉనా జిల్లా అంబ్ పోలీసు స్టేషన్ అధికారులు సెక్షన్ 64 కింద నోటీసు జారీ చేశారు. ఏ మతం, కులాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగించొద్దని కోరారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.