ఎంపీ అరవింద్ పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఫైర్
మీడియా ముందు పోజులు కొట్టడం కాదు…
పసుపు రైతుల సమస్యలు తెలుసుకోవాలి
నిజామాబాద్ లో పసుపు బోర్డు హామీపై ఏమైంది
ఎంపీ అరవింద్ ఎక్కడున్నాడంటూ వ్యాఖ్యలు
బాండ్ పేపర్ రాశారంటూ విమర్శలు
పసుపు పంటకు మద్దతు ధర ఏదంటూ ఆగ్రహం
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై బీజేపీ ఎంపీ అరవింద్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీడియా ముందు పోజులు కొడుతున్న అరవింద్ పసుపు బోర్డు ఎందుకు తేలేదని ధ్వజమెత్తారు. పసుపు పంటకు మద్దతు ధర ఏదీ? అని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశంలో బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ ఎక్కడున్నారని నిలదీశారు. జగిత్యాలలో పసుపు పండితే తమిళనాడులో బోర్డు పెడతారా? అని అగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ మీడియా ముందు పోజులు కొట్టడం కాదని, పసుపు రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని హితవు పలికారు.
గత ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతో అరవింద్ ప్రచారం సాగించారు. అయితే ఆయన గెలిచాక పసుపు బోర్డు అంశం ఎటూ తేలలేదు. దానికితోడు పసుపు బోర్డును కేంద్రం తమిళనాడులో ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అరవింద్ పై విమర్శలు తీవ్రమయ్యాయి.
దీనిపై అరవింద్ ఓ కార్యక్రమంలో స్పందించారు. తమిళనాడు మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశం ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు బదులు రీజనల్ స్పైసెస్ బోర్డు ద్వారా పసుపు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.