గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అరెస్ట్… ఖండించిన రాహుల్ గాంధీ!
- నాథూరాం గాడ్సే పేరును ప్రస్తావిస్తూ మేవానీ ట్వీట్
- వివాదాస్పద ట్వీట్‌ను తొలగించిన ట్విట్టర్
- ఆ ట్వీట్‌పైనే అస్సాం పోలీసులకు బీజేపీ కార్యకర్త ఫిర్యాదు
- పాలంపూర్‌లో మేవానీని అరెస్ట్ చేసి గౌహతికి తరలింపు
రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కన్వీనర్, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ట్విట్టర్ వేదికగా మేవానీ పోస్ట్ చేసిన ఓ ట్వీట్‌పై బీజేపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు ఆధారంగా మేవానీని అరెస్ట్ చేసినట్లు అస్సాం పోలీసులు ప్రకటించారు. బుధవారం రాత్రి గుజరాత్‌లోని పాలంపూర్ సర్క్యూట్ హౌస్‌లో అరెస్ట్ చేసిన మేవానీని గురువారం ఉదయం అస్సాంలోని గువాహటికి తరలించినట్లు అస్సాం పోలీసులు తెలిపారు.
మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే పేరును ప్రస్తావిస్తూ మేవానీ ఈ నెల 18న ఓ ట్వీట్ చేశారు. వివాదాస్పదంగా ఉన్న సదరు ట్వీట్‌ను ట్విట్టర్ తొలగించింది. అయితే ఈ ట్వీట్ ఆధారంగా మేవానీపై చర్యలు తీసుకోవాలంటూ అస్సాంలోని కోక్రాఝర్‌కు చెందిన బీజేపీ కార్యకర్త అరూప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే మేవానీని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే మేవానీ అరెస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు చెప్పే గొంతుకను అణచివేయలేరని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.