టీఆర్ఎస్ పై ప్రధాని ఫైర్ – తెలంగాణలో బీజేపీదే అధికారం అంటూ ధీమా !
-అవినీతి- మూఢ నమ్మకాలు తాను వ్యతిరేకం
-టెక్నాలజీ ని నమ్ముకుంటాను
-తెలంగాణ ప్రజలు కుటుంబాలను కోరుకోవడం లేదు
-కుటుంబపాలన వలన అభివృద్ధి కుటుం పడుతుంది
-తెలంగాణ ప్రజల పౌరుషానికి ,పట్టుదలకు కితాబు
టీఆర్ఎస్ ప్రభుత్వం – పాలనను ప్రధాని మోదీ టార్గెట్ చేసారు.కేసీఆర్ పేరు ఎత్తకుండానే ఆయన పాలనపై నిప్పులు చెరిగారు . నేడు హైద్రాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణా ప్రజల పౌరుషాన్ని పట్టుదలను మెచ్చుకున్నారు . నిర్దేశించిన సమయం కంటే మార్పు జరిగిన షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ బేగంపేటకు చేరుకున్నారు. ఆయన బీజేపీ నేతల కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎక్కడా సీఎం కేసీఆర్ పేరెత్తకుండానే తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కుటుంబ పాలన ముగిసిన చోటనే డెవలప్ మెంట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. బీజేపీ తెలంగాణ భవిష్యత్ కోసం పోరాడుతుందని హామీ ఇచ్చారు.
తెలంగాణలో మార్పు ఖాయమని..బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఇందు కోసం ఇక్కడి ప్రజలు ఫిక్స్ అయిపోయారంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీల నుంచి విముక్తి కలగాలంటూ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయం అంటూ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారంటూ ప్రధాని ఎద్దేవా చేసారు. తెలంగాణలో మార్పు దిశగా గతంలో జరిగిన ఎన్నికలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయని చెప్పారు. పథకాల్లో రాజకీయం చేస్తున్నారని..పేదలు నష్టపోతారని హెచ్చరించారు.
తెలంగాణలో బీజేపీ కార్యకర్తల పైన దాడుల విషయం తన దాకా వచ్చిందన్నారు. ముగ్గురు ప్రాణత్యాగం చేసారని ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలోనూ కొందరు మూఢ నమ్మకాలతో ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఒక ప్రాంతానికి వెళ్తే అధికారం కోల్పోతారని..సీఎం పదవి పోతుందని చెప్పారని..తాను పదే పదే అక్కడకు వెళ్లేవాడినని చెప్పారు. మూడనమ్మకాలు తెలంగాణ డెవలప్ మెంట్ కు అడ్డంకిగా మారాయని పేర్కొన్నారు. తాను టెక్నాలజీని నమ్ముతానని చెప్పారు. తెలంగాణ ప్రజలు సైతం అదే నమ్మకొని పని చేయాలని సూచించారు. యూపీ సీఎం గురించి ప్రస్తావించారు. ఒక పార్టీకి ఇక్కడి అధికార పార్టీ గులాం గిరీ చేస్తోందంటూ ఆరోపించారు. సర్దార్ పటేల్ ఆశయ సాధన కోసం తెలంగాణ కార్యకర్తలు పని చేయాలన్నారు.
అనేక మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసారని..వారు ఒక్క కుటుంబం కోసం చేయలేదంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసే వారు నేడు కూడా ఉన్నారంటూ ప్రధాని హెచ్చరించారు. తెలంగాణ డెవలప్ మెంట్ కు తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని స్పష్టం చేసారు. ఈ రాష్ట్రాన్ని కుటుంబ పాలనలో బంధించాలని చూస్తున్నారంటూ ప్రధాని ఫైర్ అయ్యారు. కుటుంబ పార్టీలు దేశానికి వ్యతిరేకమని..వారు ఎలాంటి స్వలాభం చూసుకుంటారో చూస్తున్నామని చెప్పుకొచ్చారు. కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ప్రధాని పేర్కొన్నారు.