వివేకా హత్య కేసులో కీలక మలుపు.. బీటెక్ రవి సహా ఆరుగురిని విచారించాలంటూ పిటిషన్!
-కేసు నిందితుడు దేవిరెడ్డి భార్య తులశమ్మ పిటిషన్
-వివేకా అల్లుడు, బావమరిదిని కూడా విచారించాలంటూ విజ్ఞప్తి
-పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన పులివెందుల కోర్టు
-తదుపరి విచారణ ఆగస్టు 30కి వాయిదా
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉండి అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పులివెందుల కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో టీడీపీ కీలక నేత బీటెక్ రవి సహా ఆరుగురు వ్యక్తులను విచారించాలంటూ ఫిబ్రవరి 21న ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను పులివెందుల కోర్టు మంగళవారం విచారించింది.
వివేకా హత్య కేసులో బీటెక్ రవితో పాటు వివేకా అల్లుడు రాజశేఖర్, బావమరిది శివప్రకాశ్, కొమ్మా పరమేశ్వర్, రాజేశ్వర్ రెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌లను సీబీఐ అధికారులు విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తులశమ్మ కోర్టును కోరారు. దీంతో తులశమ్మ వద్ద నుంచి పూర్తి వివరాలతో కూడిన వాంగ్మూలాన్ని సేకరించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఈ పిటిషన్ తదుపరి విచారణను ఆగస్టు 30కి వాయిదా వేసింది.