Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎవరు ఈ ఎకనాథ్ షిండే ….ఆటో వాలా …సీఎం వరకు

 ఏక్‌నాథ్‌ శిందే .. నిన్న మొన్నటివరకు అనేకమందికి అంతగా పరిచయంలేని పేరు. కానీ గత తొమ్మిది రోజులుగా దేశమంతా మార్మోగుతోంది. ఉద్ధవ్‌ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని నిలువునా కూల్చడంలో చక్రం తిప్పారు. శివసేనపై తిరుగుబావుటా ఎగురవేసి ఉద్ధవ్‌ ఠాక్రేకు వ్యతిరేకంగా మూడింట రెండొంతుల మందికి పైగా ఎమ్మెల్యేలను తన వైపునకు ఆకర్షించడం ద్వారా తన రాజకీయ వ్యూహాలకు తిరుగులేదని నిరూపించుకున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన శరద్‌ పవార్‌లాంటి హేమాహేమీలు నేతలున్న మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వానికి మరో గత్యంతరం లేక చివరకు అధికారం వదులుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు.. భాజపాను మెప్పించడం ద్వారా అనూహ్యంగా సీఎం పీఠాన్ని తానే అధిరోహించారు. ఒకప్పుడు ఆటోడ్రైవర్‌గా పనిచేసి దేశంలో కీలక రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఏక్‌నాథ్‌ శిందే రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే..

బతుకుదెరువు కోసం ఆటో నడిపారు..

మహారాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపేసిన ఏక్‌నాథ్‌ శిందే అట్టడుగు స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగారు. ఆయన స్వస్థలం సతారా. బతుకుదెరువు కోసం ముంబయి శివారులోని ఠాణెకి వచ్చిన శిందే కుటుంబం అక్కడే స్థిరపడింది. ఠాణెలోని మంగళా హైస్కూల్‌లో 11వ తరగతి వరకు చదువుకున్న ఆయన.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కుటుంబానికి అండగా ఉండేందుకు ఆటో రిక్షా, టెంపో డ్రైవర్‌గా పనిచేశారు. శిందేకు ముగ్గురు కుమారులు ఉండగా.. 2000 సంవత్సరంలో జరిగిన బోటు ప్రమాదంలో ఇద్దరు కుమారులను కోల్పోయారు. అనంతరం కొన్ని నెలలపాటు తీవ్ర కుంగుబాటుకు గురైన శిందే.. తన రాజకీయ గురువు ఆనంద్‌ దిఘే మద్దతులో క్రియాశీల రాజకీయాల్లో బిజీ కావడంతో ఆ విషాదం నుంచి త్వరగా బయటపడగలిగారు.

ఆ ఇద్దరి ప్రభావంతోనే రాజకీయాల్లోకి..

ప్రజా ఉద్యమాల్లో చురుకునే ఉండే ఏక్‌నాథ్‌ శిందే శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే, పార్టీ ఠాణె జిల్లా ఇన్‌ఛార్జ్‌ ఆనంద్‌ దిఘే ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి ఠాణె శివసేన అధ్యక్షుడు ఆనంద్‌ దిఘే ఆయన్ను ఎంతగానో ప్రోత్సహించారు. దీంతో బాలాసాహెబ్‌ ఠాక్రే స్ఫూర్తితో 1980లో రాజకీయాల్లోకి చేరారు. 2001లో ఆనంద్‌ దిఘే మృతిచెందడంతో ఆయన వారసుడిగా ఠాణె శివసేనలో కీలక నేతగా ఎదిగారు. 1997లో తొలుత మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఠాణె కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఆ జిల్లాలో జరిగే ప్రజా ఉద్యమాల్లో ముందుండే శిందే.. శివసేన అధిష్ఠానం దృష్టిలో పడడంతో అసెంబ్లీకి పోటీ చేసేందుకు అవకాశం దక్కించుకున్నారు. అలా 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో కొపారి- పంచపఖాడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత శాసనసభలో శివసేన పక్షనేత బాధ్యతలు చూడటంతో పాటు మంత్రి అయ్యారు. 2019లోనూ వరుసగా రెండోసారి శివసేన శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అలాగే, ఉద్ధవ్‌ కేబినెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఠాణె ప్రాంతంలో శివసేనను బలోపేతం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా శిందే కుమారుడు శ్రీకాంత్‌ శిందే కూడా లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. ఆయన సోదరుడు ప్రకాశ్‌ శిందే మాత్రం కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు.

గతంలో సీఎం ఆశలు గల్లంతై..

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భాజపాతో కలిసి పోటీ చేసిన శివసేన.. ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం పోస్టు విషయంలో తలెత్తిన విభేదాలతో ఎంతో కాలంగా ఉన్న తన మిత్రపక్షం భాజపాకు గుడ్‌బై చెప్పింది. ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్‌ అఘాడీ (MVA) కూటమిగా ఏర్పడింది. ఈ కూటమి ఏర్పాటులో శిందే కూడా కీలకంగా వ్యవహరించారు. అయితే, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత శివ సైనికుడినే సీఎంను చేయాలని కూటమి భావించింది. అయితే, అప్పటికి ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడంతో సీఎం రేసులో ఏక్‌నాథ్‌ శిందే పేరు ప్రధానంగా వినిపించింది. కానీ, ఇందుకు ఎన్సీపీ అభ్యంతరం చెప్పడంతో చివరకు ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. దీంతో శిందే ఆశలు గల్లంతయ్యాయి.

అదను చూసి తిరుగుబావుటా..

ఆనంద్‌ దిఘే సారథ్యంలో ఏకనాథ్‌ శిందే ఎదిగారు. గురువు దిఘే తరహాలోనే ప్రజలతో సన్నిహత సంబంధాలు, వారి సమస్యలను తీర్చడం.. తదితర కార్యక్రమాలతో ఠాణె జిల్లాలో ప్రముఖ నేతగా ఎదిగారు. కేవలం ఠాణె మాత్రమే కాకుండా పాల్ఘార్‌ జిల్లాలోనూ ఆయన మాటే వేదం. సేనలో ప్రముఖ నేతలు నారాయణ్‌ రాణె, రాజ్‌ఠాక్రే బయటకు వెళ్లిపోయినా శిందే నేతృత్వంలోనే శివసేన కార్యక్రమాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చేవారు. శివసేనకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్న శిందేకు ఉద్ధవ్‌ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహా వికాస్‌అఘాడి ప్రభుత్వాన్ని నెలకొల్పడం రుచించలేదు. దీంతో సమయం కోసం వేచి చూసిన ఆయన తిరుగుబావుటా ఎగురవేశారు. గువాహటిలోని ఓ హోటల్‌లో క్యాంపు రాజకీయాలు నడిపి తొమ్మిది రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేకెత్తించారు. తనవర్గం ఎమ్మెల్యేలను నిలుపుకొంటూనే రోజురోజుకీ తన వైపు సంఖ్యా బలాన్ని పెంచుకోవడంలో సఫలీకృతమై భాజపా మెప్పు పొందారు. తద్వారా అనూహ్యంగా తానే సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మహారాష్ట్రను నడిపించబోతున్నారు.

Related posts

కేసీఆర్ పై పోటీకి సై అంటున్న తీన్మార్ మల్లన్న !

Drukpadam

కృష్ణా కరకట్ట మీద ఉన్నది చంద్రబాబు ఇల్లు కాదు మిస్టర్ సజ్జల …వర్ల …

Drukpadam

కేసీఆర్​ చెబుతున్న తెలంగాణ ‘అభివృద్ధి’పై మహారాష్ట్ర జర్నలిస్టుల ఆరా!

Drukpadam

Leave a Comment