తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం సహా ఏపీ, తెలంగాణలకు సుప్రీంకోర్టు నోటీసులు!
- సుప్రీంకోర్టులో పర్యావరణ నిపుణుడు పురుషోత్తం రెడ్డి రిట్ పిటిషన్
- విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని వినతి
- కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చిన వైనం
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో 175గా ఉన్న అసెంబ్లీ సీట్లను 225కు, అదే సమయంలో తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలన్న ప్రతిపాదన చాలా కాలం నుంచి ఉన్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తన పిటిషన్‌లో ఆయన కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.