ఎన్టీఆర్ ను అవమానించినట్టే.. హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పురందేశ్వరి!
-ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పిడిపై స్పందించిన పురందేశ్వరి
-ఎన్టీఆర్ పై అపార గౌరవం ఉందంటూనే ఆయన పేరు మార్చేస్తారా? అని ప్రశ్న
-స్వలాభాపేక్ష లేకుండా హెల్త్ వర్సిటీని ఏర్పాటు చేశారన్న బీజేపీ నేత
-పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామన్న ఎన్టీఆర్ కుటుంబం
-అన్ని కులాలు, మతాలు, పార్టీలకు చెందిన వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్య
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాదాపుగా అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ తనయ, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి గురువారం స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో నుంచి ఎన్టీఆర్ పేరును తీసి వేయడం అంటే.. ఎన్టీఆర్ ను అవమానించినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు.
తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఒక గొడుగు కిందకు తీసుకురావాలన్న మంచి ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ ఈ సంస్థను ఏర్పాటు చేశారని ఆమె చెప్పుకొచ్చారు. స్వలాభాపేక్ష లేకుండా ఎన్టీఆర్ పాలన సాగిస్తే… ఇప్పటి పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును ఎందుకు మార్చారో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఓ వైపు ఎన్టీఆర్ పై తనకు అపార గౌరవం ఉందంటూనే… ఆయన పేరును తొలగించడం అన్యాయమని ఆమె అన్నారు.
ఎన్టీఆర్ కుటంబం తీవ్ర అసంతృప్తి …
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి, వైఎస్సార్ పేరును ఏపీ ప్రభుత్వం పెట్టడంపై నందమూరి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూనివర్శిటీని స్థాపించిందే ఎన్టీఆర్ అయినప్పుడు… ఆయన పేరును ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.
ఈ మేరకు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ పేరిట నందమూరి కుటుంబం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇదొక దురదృష్టకరమైన పరిణామమని ప్రకటనలో వారు పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మాభిమానాన్ని నలుదిక్కులా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని వారు చెప్పారు. అన్ని కులాలు, మతాలు, పార్టీలకు చెందిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. అలాంటి ఒక యుగపురుషుడి పేరును మార్చడం.. ముమ్మాటికీ తెలుగు జాతిని అవమానించినట్టేనని చెప్పారు.
మరోవైపు, ఎన్టీఆర్ పేరును తొలగించడంపై పార్టీలకు అతీతంగా అన్ని విపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ శ్రేణులు పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలను చేపట్టాయి. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటని ప్రభుత్వాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.