Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తొలి పది’లో ఆరుగురు బాలురే!

Warangal: Irregularity in admission to PG med seats in pvt colleges

 

 

తొలి పది’లో ఆరుగురు బాలురే!

జాతీయ స్థాయిలో 10,55,851కు.. రాష్ట్రంలో 36,795

నీట్‌ రాష్ట్రస్థాయి ర్యాంకులను విడుదల చేసిన కాళోజీ వర్సిటీ

వచ్చే నెల రెండో వారంలో ప్రవేశ ప్రకటన!

 

హైదరాబాద్‌: వైద్యవిద్య ప్రవేశ పరీక్ష(నీట్‌)లో అర్హత సాధించిన రాష్ట్ర స్థాయి ర్యాంకర్ల ప్రాథమిక సమాచారాన్ని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. ఇటీవల అఖిల భారత స్థాయిలో నీట్‌ ర్యాంకులను విడుదల చేయగా.. తాజాగా రాష్ట్ర స్థాయిలో ఆ సమాచారాన్ని వెల్లడించారు. జాతీయ స్థాయిలో అయిదో స్థానంలో నిలిచిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు రాష్ట్రంలో తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రాష్ట్ర స్థాయి తొలి 10 ర్యాంకుల్లో ఆరింటిని బాలురు, నాలుగింటిని బాలికలు పొందారు. తొలి 50 స్థానాల్లోనూ 28 మంది బాలురు ఉత్తమ ర్యాంకులు సాధించి.. బాలికల(22 మంది) కంటే ముందంజలో నిలిచారు.

అఖిల భారత స్థాయిలో 158వ ర్యాంకు సాధించిన అభ్యర్థి రాష్ట్ర స్థాయిలో 10వ స్థానంలో నిలిచాడు. జాతీయ స్థాయిలో 271, 756, 1,994 ర్యాంకులు వచ్చిన వారు రాష్ట్రస్థాయిలో 20, 50, 100 ర్యాంకులను పొందారు.

రాష్ట్ర స్థాయిలో ఆఖరి ర్యాంకు 36,795. ఈ అభ్యర్థికి అఖిల భారత స్థాయిలో 10,55,851 ర్యాంకు వచ్చింది.

మార్కుల పరంగా చూసినా.. 711 సాధించిన సిద్ధార్థరావు రాష్ట్రంలో తొలిస్థానంలో నిలవగా.. 705 మార్కుల వద్ద ఇద్దరు, 700 వద్ద నలుగురు, 695 వద్ద ఆరుగురు, 690 మార్కుల వద్దనైతే ఏకంగా 15 మంది పోటీ పడ్డారు. ఎక్కువ మార్కులు సాధించినా.. తీవ్ర పోటీ నేపథ్యంలో విద్యార్థుల ర్యాంకులు దిగువకు వెళ్లాయని నిపుణులు విశ్లేషించారు.

కటాఫ్‌ మార్కులను విశ్లేషిస్తే.. ఓపెన్‌ కేటగిరీకి 117 మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు 93 మార్కులు, పీడబ్ల్యూడీ జనరల్‌కు 105 మార్కులను అర్హతగా నిర్ణయించారు.

రాష్ట్ర ర్యాంకుల్లో తమ పేర్లు కనబడకపోయినా తెలుగు విద్యార్థులు ఆందోళన పడనక్కర్లేదని.. వారు నీట్‌లో అర్హత సాధించి ఉంటే.. ఆ ర్యాంకులను ప్రాతిపదికగా చేసుకునే ప్రవేశాలు కల్పిస్తామని కాళోజీ వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ పరీక్ష రాసి ఉండొచ్చని.. అలాంటప్పుడు ఆయా అభ్యర్థుల ర్యాంకులు తెలంగాణ, ఏపీల్లో కనిపించవని వెల్లడించారు.

గతేడాది తొలిసీటు పొందింది 992వ ర్యాంకర్‌

రాష్ట్ర ర్యాంకుల్లో తొలి స్థానాలను సాధించినా.. ఇందులో అత్యధికులు రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో చేరడం లేదు. ఎయిమ్స్‌, జిప్‌మర్‌ వంటి వైద్య సంస్థల్లో చేరడానికి మొగ్గుచూపుతున్నారు. గతేడాది రాష్ట్రంలో ప్రవేశాలను పరిశీలిస్తే.. ఎంబీబీఎస్‌లో తొలిసీటు దక్కించుకున్న అభ్యర్థి అఖిల భారత ర్యాంకు 992. మొత్తంగా అఖిల భారత స్థాయిలో రెండువేల లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థులు కేవలం 8 మందే రాష్ట్రంలో ఎంబీబీఎస్‌లో చేరగా.. 3 వేల లోపు ర్యాంకు పొందిన వారు 13 మంది మాత్రమే ఇక్కడ ప్రవేశాలు పొందారు. దీన్నిబట్టి రాష్ట్రంలో సీట్లను ఎక్కువగా జాతీయ స్థాయిలో 3 వేల ర్యాంకు పైబడిన వారే పొందినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాదీ అదే తరహాలో సీట్లు పొందే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ముందుగా అఖిల భారత కోటా ప్రవేశాలు

సాధారణంగా ఏటా జూన్‌, జులై మాసాల్లో వైద్య విద్య ప్రవేశాలు పూర్తయి.. ఆగస్టులో తరగతులు ప్రారంభమవుతుంటాయి. గత మూడేళ్లుగా కొవిడ్‌ దృష్ట్యా నీట్‌ నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఆ ప్రభావం ప్రవేశాలపై పడి.. నవంబరులోగానీ ప్రవేశ ప్రక్రియ పూర్తికావడం లేదు. ఈ ఏడాదీ జాప్యం జరిగిన నేపథ్యంలో వచ్చే నెల రెండో వారంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు ప్రకటన జారీ చేసే అవకాశాలున్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. అఖిల భారత కోటా ప్రవేశాల ప్రకటన వెలువడిన అనంతరమే రాష్ట్రంలో ప్రవేశ ప్రకటన వెలువరించనున్నట్లు తెలుస్తోంది. ప్రవేశ ప్రకటన అనంతరం దాదాపు 7 రోజులపాటు దరఖాస్తులకు గడువిస్తారు. ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈసారీ ఆన్‌లైన్‌లోనే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది కూడా నవంబరులోనే వైద్యవిద్య తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి.

Related posts

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భారత్ చిత్తు చిత్తు..10 వికెట్లతో గెలిచిన ఇంగ్లాండ్ !

Drukpadam

ఏపీలో ఇక బీసీ కుల గణన…!

Drukpadam

మునుగోడులో టీఆర్ యస్ కు ముచ్చమటలు…

Drukpadam

Leave a Comment