హై కొలెస్ట్రాల్ కు తొలి సంకేతాలు ఇవే!
- గుండె జబ్బులకు దారితీసే చెడు కొలెస్ట్రాల్
- చాపకింద నీరులా వ్యాపిస్తుందంటున్న నిపుణులు
- మొదట్లో పెద్దగా సమస్యలు కనిపించవని వెల్లడి
- కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తనాళాల్లో అడ్డంకులు
- గుండెపోటుకు దారితీసే ప్రమాదం
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికమైతే గుండె జబ్బులకు దారితీస్తుందన్న సంగతి తెలిసిందే. హై కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి, గుండెపోటు ముప్పు అధికమవుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పెరుగుతాయి. దాంతో, తొలిదశలో చాలామంది దీన్ని గుర్తించలేరు. అందుకే హై కొలెస్ట్రాల్ ను సైలెంట్ కిల్లర్ గా పిలుస్తారు.
అయితే, సాధారణ సమస్యల్లాగే కనిపించే కొన్ని లక్షణాలతో హై కొలెస్ట్రాల్ ముప్పును ముందుగానే పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనకు కాళ్లు, చేతుల్లో నొప్పులు సహజమే. ఏదైనా గట్టి పని చేసినప్పుడు నొప్పులు కలుగుతుంటాయి. అయితే ఏ పని చేయకపోయినా కాళ్లలో నొప్పి కలిగితే అది హై కొలెస్ట్రాల్ కు సంకేతంగా భావించాల్సి ఉంటుంది.
రక్తనాళాల్లో హై కొలెస్ట్రాల్ పదార్థం పేరుకుపోవడం వల్ల రక్తం సరఫరాకు ఆటంకాలు ఏర్పడతాయి. దాంతో కండరాలకు తగినంత రక్త ప్రసరణ జరగక, కాళ్ల నొప్పులు కలుగుతాయి. కాళ్లలోనే కాదు తొడ కండరాలు, కాలి పిక్కలు, పిరుదుల నొప్పులు కూడా బాధిస్తుంటే వాటిని తేలిగ్గా తీసుకోరాదు. సాధారణ కాళ్ల నొప్పులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ హై కొలెస్ట్రాల్ వల్ల కలిగే నొప్పులు తరచుగా బాధిస్తుంటాయి.
ఇదే కాదు, హై కొలెస్ట్రాల్ ను మరికొన్ని లక్షణాల ద్వారా కూడా ప్రారంభస్థాయిలోనే గుర్తించవచ్చు. పాదాల్లో మంటలు, కాళ్లపై చర్మం రంగు మారడం, పాదాలు, కాలివేళ్లకు పుండ్లు, తరచుగా కాళ్ల చర్మంపై ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటే కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
కొలెస్ట్రాల్ పరీక్షల వివరాలకొస్తే… సాధారణ కొలెస్ట్రాల్ పరీక్షలో ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), హెచ్ డీఎల్ (మంచి కొలెస్ట్రాల్), ట్రైగ్లిజరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్ లను లెక్కిస్తారు. టోటల్ కొలెస్ట్రాల్ 200 ఎంజీ/డీఎల్ ఉంటే నార్మల్ గా ఉన్నట్టు భావించాలి.
కొలెస్ట్రాల్ స్థాయులు 200 నుంచి 239 ఎంజీ/డీఎల్ మధ్యన ఉంటే జాగ్రత్తపడాల్సిన విషయం అని భావించాలి. ఇక 240 ఎంజీ/డీఎల్ పైన కొలెస్ట్రాల్ స్థాయులను గుర్తిస్తే అది హై కొలెస్ట్రాల్ గా నిర్ధారిస్తారు. మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు కొలెస్ట్రాల్ స్థాయిని 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి.
కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, నిల్వ ఆహార పదార్థాలు, స్థూలకాయం, ధూమపానం, మద్యపానం, ఇతర జీవనశైలి అంశాల కారణంగా హై కొలెస్ట్రాల్ బారినపడుతుంటారు. అంతేకాదు, కుటుంబ సభ్యుల పూర్వీకుల్లో ఎవరికైనా హై కొలెస్ట్రాల్ ఉన్నా, అది వారసత్వంగా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
హై కొలెస్ట్రాల్ బారినపడకుండా ఉండాలంటే జీవనశైలిని మార్చుకోవడం అత్యవసరం. ఆరోగ్యకరమైన అలవాట్లలో హై కొలెస్ట్రాల్ ను దూరంగా ఉంచవచ్చు. శరీరానికి తగిన పని కల్పించడం, నిల్వ ఆహార పదార్థాల వాడకం తగ్గించడం, సీజన్ లో దొరికే పండ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల హై కొలెస్ట్రాల్ ను కట్టడి చేయవచ్చు.