కరోనా ఉగ్రరూపం నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం తాజా మార్గదర్శకాలు
-మే 1 నుంచి దేశంలో 3వ విడత కరోనా వ్యాక్సినేషన్
-18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్
-దేశంలో కరోనా విజృంభణ
-కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమావేశం
దేశంలో మే 1 నుంచి మూడో విడత కరోనా వ్యాక్సినేషన్ జరగనుంది. 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. అదే సమయంలో లక్షల సంఖ్యలో రోజువారీ కేసులు వస్తుండడంతో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
విస్తృత స్థాయిలో ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లో పడకల లభ్యతపై సమాచారం కోసం కాల్ సెంటర్ సేవలు అందించాలని నిర్దేశించింది. అందుబాటులో ఉన్న పడకలకు సంబంధించి రియల్ టైమ్ డేటా కొనసాగించాలని సూచించింది. అదనపు ప్రైవేటు కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల నమోదును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మార్గదర్శకాలు ప్రకటించారు.
డీఆర్డీఓ, సీఎస్ఐఆర్ వంటి సంస్థల సహకారంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఫీల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి.
పూర్తిస్థాయిలో కొవిడ్-19 ఆసుపత్రులుగా పనిచేసే వీలున్న అదనపు ఆసుపత్రుల గుర్తింపు.
ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ సరఫరాపై పూర్తి భరోసాకు ఏర్పాట్లు.
లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు కలిగిన కరోనా పాజిటివ్ వ్యక్తులకు కూడా చికిత్స అందించేలా కొవిడ్ కేర్ సెంటర్లను విస్తరించాలి.
నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరాతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల నిర్వహణ.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు… కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖలు తమ సీఎస్సార్ నిధులతో తాత్కాలిక ఆసుపత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.