హిమాచల్ ప్రదేశ్‌లో ప్రారంభమైన పోలింగ్.. సంప్రదాయానికి ఓటర్లు బ్రేక్ వేస్తారా?
- రాష్ట్రంలోని 68 స్థానాల్లో పోటీపడుతున్న 412 మంది అభ్యర్థులు
- అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్న 55 లక్షల మంది ఓటర్లు
- అధికారం కోసం ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్, ఆప్
- సంప్రదాయానికి ఓటర్లు ఫుల్‌స్టాప్ పెడతారంటున్న బీజేపీ
హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి రెండోసారి అధికారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈసారి ఓటర్లు ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి తమకు రెండోసారి అధికారం కట్టబెడతారని బీజేపీ ఆశలు పెట్టుకోగా, ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్ ఘంటాపథంగా చెబుతోంది. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఆశలు పెట్టుకుంది.
రాష్ట్రంలోని మొత్తం 55 లక్షల మంది ఓటర్లు 68 స్థానాల్లో పోటీపడుతున్న 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పోటీపడుతున్న అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి జితిన్ రామ్ ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ తదితరులు కూడా ఉన్నారు. అభివృద్ధి అజెండాతో రెండోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ బలంగా నమ్ముతోంది.
రాష్ట్రంలో ప్రచారాన్ని ప్రధాని నరేంద్రమోదీ ముందుండి నడిపించారు. కమలానికి వేసే ప్రతి ఓటు తన బలాన్ని మరింత పెంచుతుందని ప్రచారంలో మోదీ పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పడిపోతున్న గ్రాఫ్‌ను నిలబెట్టుకోవాలని, పార్టీలో పునరుజ్జీవం తీసుకురావాలని కాంగ్రెస్ యోచిస్తోంది.