జేసీ ప్రభాకర్ రెడ్డికి షాకిచ్చిన ఈడీ.. ఆస్తుల అటాచ్!
- బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ లో అవకతవకలు
- రూ. 22.10 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
- సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఈడీ
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) షాకిచ్చింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ లో అవకతవకలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డికి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దివాకర్ రోడ్ లైన్స్, జఠాదర ఇండస్ట్రీస్ కు చెందిన రూ. 22.10 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో కొత్త వాహనాలను కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. రూ. 38.36 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఈడీ తన ప్రకటనలో తెలిపింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొంది. నాగాలాండ్, కర్ణాటక, ఏపీలలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించారని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి 2020 జూన్ లో జేపీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలతో పాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులను నమోదు చేశారు. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. అనంతరం వీరు బెయిల్ పై విడుదలయ్యారు.