అవును! శ్రద్ధను నేనే చంపా: నార్కో పరీక్షలో అంగీకరించిన అఫ్తాబ్!
నిన్న ఉదయం 8.40 గంటలకు అఫ్తాబ్‌ను డాక్టర్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
10 గంటల వరకు నార్కో టెస్ట్
శ్రద్ధను హత్య చేసిన రోజున ఆమె ఎలాంటి దుస్తులు ధరించిందో కూడా చెప్పిన నిందితుడు
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యకేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా నేరాన్ని అంగీకరించాడు. నిన్న నిర్వహించిన నార్కో అనాలిసిస్ పరీక్షలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. శ్రద్ధాను తానే చంపానని అంగీకరించిన అఫ్తాబ్.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఎక్కడ దాచి పెట్టిందీ వెల్లడించాడు.
అంతేకాదు, శ్రద్ధను చంపినప్పుడు ఆమె ఎలాంటి దుస్తులు ధరించి ఉన్నదీ చెప్పడంతోపాటు ఆమె వద్దనున్న ఫోన్ వివరాలను కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది. పాలీగ్రాఫ్, నార్కో అనాలిసిస్ పరీక్షల్లో అఫ్తాబ్ చెప్పిన సమాధానాలను విశ్లేషించుకునేందుకు నేడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం.
కాగా, అంతకుముందు ఉదయం 8.40 గంటల సమయంలో అధికారులు అఫ్తాబ్‌ను తీహార్ జైలు నుంచి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 10 గంటల వరకు నార్కో పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. నార్కో పరీక్షల సమయంలో సైకాలజిస్ట్, ఫొటో ఎక్స్‌పర్ట్, అంబేద్కర్ ఆసుపత్రి వైద్యులు ఉన్నట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు. కాగా, అఫ్తాబ్‌కు నిర్వహించిన నార్కో టెస్టు విజయవంతమైందని అధికారులు తెలిపారు.