ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 98 వార్షికోత్సవాలు …
–దేశవ్యాపితంగా సంబరాలు
–పార్టీ కార్యాలయాలయాలకు విద్యుత్ వెలుగులు
–కార్మిక వాడల్లో ఎర్రజెండాలు రెపరెపలు
–బడుగు బలహీనవర్గాలకు అండగా ఎర్రజెండా
ఎర్రజెండా ఇది కార్మికుల కర్షకులకు అండగా ఉంటుందని ప్రజలకు విశ్వాసం …వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ,బడుగు బలహీనవర్గాలకు అండగా దోపిడీకి వ్యతిరేకంగా పుట్టిందే ఎర్రజెండా …భారత దేశంలో ఎర్రజెండాకు ఘనమైన చరిత్రే ఉంది. కానీ కమ్యూనిస్ట్ ఉద్యమ చీలిక ప్రజా ఉద్యమాలకు , కార్మిక కర్షక పోరాటాలకు కారణాలు ఏమైనా నష్టం కలిగించింది. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీల పుట్టుకపైనా రెండు అభిప్రాయాలూ ఉన్నాయి. సిపిఐ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ 1925 ఏర్పడిందని చెపుతుండగా ,లేదు 1920 లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిందని సిపిఎం అంటుంది. ఇందుకు ఎవరి వాదనలు వారు చేస్తున్నారు. ఎమైనా సిపిఐ 98 వార్షికోత్సవాలు దేశవ్యాపితంగా ఘనంగా జరుపుకోవడం సంతోషదాయకం …
దేశంలో సోషలిజం తెచ్చేందుకు భారత ప్రభుత్వం పై రెండు పార్టీలు రెండు రకాల అభిప్రాయాలను ప్రకటించాయి. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వరంలో కేరళలో మొదటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఇ ఎం ఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో 1957లో ఏర్పడింది. దాన్ని కొద్దిరోజుల్లోనే అప్పటి నెహ్రు ప్రభుత్వం ఆర్టికల్ 356 ను ఉపయోగించి రద్దు చేసింది.
అంతకు ముందు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ,పున్నప్ప వాయిలార్ ఉద్యమం,తేబగా పోరాటాలు కమ్యూనిస్టుల సత్తాను చాటాయి.ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో సాయిధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకత సంతరించుకుంది. ఈపోరాటాన్ని కొనసాగించాలని కొంతమంది ,వద్దని కొంతమంది పార్టీలో రెండు వాదనలు రావడంతో రష్యా లో స్టాలిన్ సలహాకోసం ఇక్కడనుంచి భారత కమ్యూనిస్ట్ నేతలు వెళ్లారు . ఆయన సలహా మేరకు సాయిధ రైతాంగ పోరాటాన్ని కమ్యూనిస్టులు విరమించుకున్నారు .అయితే 4 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు .10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటనిది . ఈ ఉద్యమ ప్రభావం దేశవ్యాప్తంగా పడి కమ్యూనిస్టుపార్టీ వైపు ప్రజలను ఆకర్షించ కలిగింది . అనేక రాష్ట్రాల్లో ఉద్యమంలోకి విద్యార్థులు ,యువకులు ఆకర్షించ పడ్డారు . కార్మిక,కర్షికప్రభుత్వస్థానకోసం కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు మరవలేనివి .
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో కమ్యూనిస్టులు ,కాంగ్రెస్ పార్టీలు మాత్రమే ఉన్నాయి.1957 ఎన్నికల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి రాబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కమ్యూనిస్టులు వస్తే తమ ఆటలు సాగవని భయపడ్డ భూస్వాములు ,పెత్తందార్లు కమ్యూనిస్టులపై తప్పడు ప్రచారం చేశారు దీంతో అధికారంలోకి రావాల్సిన కమ్యూనిస్టులు ప్రతిపక్షానికే పరిమితమైయ్యారు . 1964 లో కమ్యూనిస్టుల్లో వచ్చిన సైద్ధాంతిక విభేదాలు చీలికకు దారితీశాయి. తరవాత రెండు కమ్యూనిస్టులు కలిసి పోవాలనే అభిప్రాయాలు ముందుకు వచ్చినా ఫలితం మాత్రం లేకుండా పోయింది .1967 మరో చీలిక , తర్వాత అనేక చీలికలు కమ్యూనిస్టుల ఉద్యమాలను మరింత దెబ్బతీసింది .
ఒకప్పుడు 6 శాతం వరకు ఉన్న కామ్రేడ్స్ ఓట్లు క్రమేణా తగ్గి రెండు పార్టీలకు కలిపి 1 శాతానికి పడిపోయాయి.మొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కమ్యూనిస్టుల ప్రభావం బాగా తగ్గింది. 2014 వీడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో 2018 ,2019 లలో జరిగిన తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కమ్యూనిస్టలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం లేకపోవడంతో పేదల గొంతుకగా ఉన్న కమ్యూనిస్టుల పాత్ర ఓటమితో కార్మికులకు ,కర్షకులకు ,పేదలకు ,యువకులకు ,విద్యార్థులకు ,మహిళలకు నష్టదాయకంగా మారింది . బడుగు బలహీనవర్గాలకు అండగా ఉన్న ఎర్రజెండా రెపరెపలాడేందుకు 98 వార్షికోత్సవాలు ప్రేరణకావాలని, కమ్యూనిస్ట్ ఉద్యమ ఐక్యతకు దోహదపడాలని ఆశిద్దాం …