Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బెంగాల్ సీఎంగా మూడవసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌మ‌త బెన‌ర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎంగా మూడవసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌మ‌త బెన‌ర్జీ
-రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జ‌రిగిన కార్య‌క్ర‌మం
-ప్ర‌మాణం చేయించిన‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌
-ఎన్నికల అనంతరం చెలరేగిన అల్లర్లను ప్రస్తావించిన గవర్నర్
-మమతా కు సుతి మెత్తని హెచ్చరికలు
-క‌రోనా నేప‌థ్యంలో కొద్ది మందికే ఆహ్వానం
-ప్రధాని మోడీ తోపాటు పలువురు అభినందనలు

ఇటీవ‌ల జ‌రిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ రోజు ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ హ్యాట్రిక్ విజయాలతో మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశంలో కరోనా ఉద్ధృతి విప‌రీతంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్ర‌మాణ స్వీకార‌ కార్యక్రమం నిరాడంబరంగా జ‌రిగింది.

దీనికి ‌కొద్దిమంది అతిథులను మాత్ర‌మే ఆహ్వానించారు. మ‌మ‌త బెన‌ర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయ‌డం ఇది మూడోసారి. బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి చేతిలో ఆమె నందిగ్రామ్‌లో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ప‌శ్చిమ బెంగాల్‌లో శాసన మండలి లేదు. దీంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవ‌కాశం లేక‌పోవ‌డంతో సీఎంగా ఆమె పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోగా తప్పనిసరిగా ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందాల్సి ఉంటుంది.

త‌మ పార్టీ బ‌లంగా ఉండే స్థానం నుంచి ఆమె పోటీ చేసే అవ‌కాశం ఉంది. ఇందుకు గాను పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఆ స్థానంలో పోటీ చేయొచ్చు. లేదంటే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఖర్దాహా నుంచి పోటీకి నామినేష‌న్ వేసిన అనంత‌రం మృతి చెందిన టీఎంసీ నేత‌ కాజల్‌ సిన్ స్థానంలో మ‌మ‌త బెన‌ర్జీ పోటీ చేసే అవ‌కాశం ఉంది. లేదంటే అభ్య‌ర్థుల మృతితో వాయిదా ప‌డ్డ జంగీపుర్, శంషేర్‌గంజ్ స్థానాల నుంచి ఆమె పోటీ చేయొచ్చు.

కాగా, 1955 జనవరి 5న జ‌న్మించిన మ‌మ‌త బెన‌ర్జీ త‌న తండ్రి ప్రోత్సాహంతో విద్యార్థినిగా ఉన్నప్పుడే కాంగ్రెస్‌ విద్యార్థి విభాగంలో చేరి రాజ‌కీయాల్లో రాణించారు. ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు. 1984లో జాదవ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేసి గెలుపొందారు.

1991లో మళ్లీ గెలిచి, 36 ఏళ్లకే కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, 1997లో కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చి, తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఎదురులేని రాజ‌కీయ‌ శ‌క్తిగా ఉన్న‌ వామ‌ప‌క్ష పార్టీల‌ను సైతం ఓడించి 2011లో ఆమె తొలిసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

మమతకు సుతిమెత్తని హెచ్చరికలు చేసిన గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్

ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ జగదీప్‌ ధన్‌కర్ మమతకు సుతిమెత్తని హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలో టీఎంసీ విజయం తర్వాత జరిగిన హింస గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి మమత తన సోదరిలాంటి వారని, ఆమె మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతలు పునరుద్ధరించడానికి త్వరితగతిన అన్ని చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు. బెంగాల్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత మమతదేనని ధన్‌కర్ పేర్కొన్నారు.

ట్వీట్ ద్వారా దీదీకి అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించగానే ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ దీనిపై స్పందించారు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌మ‌త దీదీకి శుభాకాంక్ష‌లు అని మోదీ ట్వీట్ చేశారు. మరోపక్క, మ‌మ‌తకు ప‌లువురు నేత‌లు కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు.

 

Related posts

పొంగులేటి భుజం తట్టిన ప్రధాని మోడీ !

Drukpadam

అర్ధరాత్రి వేళ బుద్ధా వెంకన్నను విడిచిపెట్టిన పోలీసులు!

Drukpadam

ఆర్‌ఎల్‌డీ జాతీయ అధ్యక్షుడిగా అజిత్ సింగ్ తనయుడు జయంత్ చౌదరి…

Drukpadam

Leave a Comment