ఇది పక్కా రైతు వ్యతిరేక బడ్జెట్
తెలంగాణను పూర్తిగా విస్మరించారు.
ఎన్నో అడిగాం..అన్నీ మరిచారు
కనీస మద్దతు ధర ఊసే లేదు
కర్నాటకనే గుర్తుందా… మేము గుర్తు లేమా..
పార్లమెంట్ లోనే తేల్చుకుంటాం
కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు ధ్వజం
ఇది పక్కా రైతు, గ్రామీణ, పేదల, తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ అని బీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో బడ్జెట్ పై పార్లమెంటరీ నాయకుడు కె.కేశవరావుతో కలసి, విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మరిచిపోయిందని అన్నారు. తాము ఎప్పటి నుంచో అడుగుతున్న ఏ ఒక్క దానిని బడ్జెట్లో ఇవ్వలేదని అన్నారు. ఏ ఒక్క దానికి పైసా నిధులు కేటాయించకుండా తీవ్ర వివక్షత చూపించిందని నామ అన్నారు. ఏదో చేస్తుందని గ్రామీణ, బడుగు, పేద, బలహీన వర్గాల ప్రజలు ఎంతగానో ఎదురు చూశారని, తీరా బడ్జెట్ చూశాక అంతా అవాక్కయ్యామని అన్నారు. బడ్జెట్లో ఎక్కడా కనీసం రైతుల గురించిన మాటేలేదన్నారు. బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావనే లేదన్నారు. కాలేశ్వరం లాంటి ఎన్నో ప్రాజెక్టులు, కాలువలు, నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగు, తాగు నీటిని అందించిన తెలంగాణ గురించిన ప్రస్తావన లేకపోవడం, నిధులు గురించి ఊసే లేకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చి, వారి ఆందోళనతో వెనక్కి తీసుకున్నారని, కానీ బడ్జెట్లో కూడా రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి, వారికి తీవ్ర అన్యాయం చేశారని నామ పేర్కొన్నారు. కనీస మద్దతు ధర చట్టబద్ధత గురించి ప్రస్తావన లేవన్నారు. కేంద్రానివన్నీ మాయ, మోసపు మాటలని ధ్వజమెత్తారు. కర్ణాటకలో మాత్రమే కరవు ఉందట… దేశంలో ఎక్కడా లేదా ?.. రూ.5,300 కోట్లు ఒక్క రాష్ట్రానికే ఇచ్చారు.. మిగతా రాష్ట్రాలు లేవా ? ప్రజలు లేరా ? అని కేంద్రాన్ని నిలదీశారు. 9 ఏళ్లలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు.. ఇప్పటి దాకా దాదాపు 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటిని సైతం ఊడగొడుతున్నారని దుయ్యబట్టారు. నీతి అయోగ్ సిఫార్స్ చేసిన మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇస్తారని అనుకున్నాం కానీ, పైసా ఇవ్వకుండా వివక్షత చూపించారని అన్నారు. నిధులు ఇవ్వకపోగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సైతం అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఫర్ క్యాపిటల్ ఇన్ కం లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, ఒకప్పుడు రూ. 1,12,152 ఉంటే ఇప్పుడు రూ.2,75,443 ఉందని అన్నారు. 153 మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. బిఆర్ ఎస్ ఎంపీలు అనేక రకాలుగా పోరాటం చేసినా ఒక్కటి కూడా ఇవ్వలేదని అన్నారు. సొంత నిధులతో వాటిని ఏర్పాటు చేసుకున్నామని నామ చెప్పారు. గ్రామీణాభివృద్ధిని, తెలంగాణాను పూర్తిగా విస్మరించిన కేంద్రం నిరంకుశ విధానాలపై పార్లమెంట్ లో పెద్ద ఎత్తున పోరాడతామని నామ స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్టుల్లోనూ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హెూదా, నిధులు కేటాయింపుల్లో ను, విభజన హామీల్లోనూ తీవ్ర వివక్షత చూపించిందని నామ ధ్వజమెత్తారు. ఇది పేద, రైతు, మధ్య తరగతి ప్రజలను తీవ్ర అసంతృప్తికి, నిరుత్సాహానికి గురి చేసిందన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి ఏమి చెప్పనేలేదన్నారు. మరో వైపు విభజన చట్టం ఊసే లేదన్నారు. విద్యా, వైద్యానికి నిధుల్లో భారీగా కోత విధించారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన వేలాది కోట్ల బకాయిలు, నిధులు గురించిన ప్రస్తావనే లేదన్నారు. అన్నదాతను పూర్తిగా విస్మరించిన కేంద్రం తగిన మూల్యం చెల్లించకతప్పదని నామ స్పష్టం చేశారు.