బీహార్ లో గంగానదిలో తేలిన 100 కరోనా మృతదేహాలు
- బక్సర్ జిల్లా మహదేవ్ ఘాట్ వద్ద తేలిన శవాలు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు,వీడియోలు
- ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చాయన్న బీహార్ అధికారి
గంగానదిలో ఏకంగా 100 కరోనా మృతదేహాలు తేలడం బీహార్ లో కలకలం రేపుతోంది. బక్సర్ జిల్లాలోని మహదేవ్ ఘాట్ వద్ద ఈ శవాలు నీటిపై తేలుతూ కనిపించాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ శవాలు బీహార్ కు చెందినవి కాదని… తాము ఆరా తీయగా ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చాయని తేలిందని బక్సర్ జిల్లా అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, మహదేవ్ ఘాట్ కు 40 నుంచి 45 వరకు శవాలు కొట్టుకొచ్చాయని చెప్పారు. తమ ప్రాంతంలో ఎవరైనా కరోనాతో మరణిస్తే దహనం చేస్తున్నామని… కాపలాదారులను పెట్టి మరీ దహన ప్రక్రియను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ శవాలు ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకు వచ్చి ఉంటాయని చెప్పారు. నదిలో డెడ్ బాడీలను అడ్డుకునే మార్గం లేకపోవడంతో ఇక్కడి వరకు కొట్టుకొచ్చాయని అన్నారు.