కొత్త గుర్తు తీసుకోండి …ఉద్ధవ్ థాకరేకి శరద్ పవార్ కీలక సూచన!
-శివసేన అధికారిక గుర్తు ను చీలికవర్గానికి కేటాయించిన ఈసీ
-ఈసీ నిర్ణయాన్ని ఆమోదించి, కొత్త గుర్తు తీసుకోవాలన్న పవార్
-ప్రజలు కొత్త గుర్తును ఆమోదిస్తారన్న అభిప్రాయం
-గతంలో కాంగ్రెస్ కు సైతం ఇదే అనుభవం ఎదురైందని వెల్లడి
శివసేన పార్టీ, గుర్తుల విషయంలో ఉద్ధవ్ థాకరేకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక సూచన చేశారు. శివసేన పార్టీ పేరుతోపాటు, పార్టీ గుర్తుగా ఉన్న విల్లు, బాణంను శివసేన నుంచి వేరు పడిన ఏక్ నాథ్ షిండే వర్గానికి ఎన్నికల సంఘం కేటాయిస్తూ నిర్ణయం ప్రకటించడం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడతానని శివసేనాని ఉద్ధవ్ థాకరే ప్రకటించగా.. ఈ విషయంలో రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక సూచన చేశారు.
ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఆమోదించి, కొత్త పార్టీ గుర్తు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్ణయం పెద్దగా ప్రభావం చూపించదని, ప్రజలు కొత్త గుర్తును ఆమోదిస్తారని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇది ఎన్నికల సంఘం నిర్ణయం. ఒక్కసారి నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇక దానిపై చర్చ అనవసరం. ఆమోదించి కొత్త గుర్తు తీసుకోవడమే’’ అని పవార్ పేర్కొన్నారు.
‘‘ఇందిరాగాంధీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాంగ్రెస్ కు గతంలో ఆవుదూడ గుర్తు ఉండేదని దాన్ని రద్దు చేయడంతో మరో గుర్తును కాంగ్రెస్ తీసుకోని విజయం సాధించిన విషయాన్నీ గుర్తు చేశారు .ఆవుదూడ కోల్పోవడంతో హస్తం గుర్తు లభించింది. దాన్ని ప్రజలు ఆమోదించారు. అలాగే, ప్రజలు ఉద్ధవ్ థాకరే పార్టీకి సంబంధించి కొత్త గుర్తును స్వీకరిస్తారు’’ అని పవార్ పేర్కొన్నారు.
గుర్తు విషయంలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఉద్దవ్ థాకరే సమావేశాన్ని ఏర్పాటు చేశారు . ఇప్పటికి ప్రజల్లో తమకే పట్టుందని ఉద్దవ్ వర్గం వాదిస్తుంది . వారిది వెన్నుపోటు అని ,మోసం అని ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తాము ముందే ఉహించమని ఉద్దవ్ ఠాక్రే మద్దతుదారులు అంటున్నారు . కొత్తగుర్తువైపే వారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.