నందమూరి తారకరత్న కన్నుమూత!
- గత నెల 27న తారకరత్నకు గుండెపోటు
- బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స
- ఇవాళ అత్యంత విషమంగా మారిన పరిస్థితి
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. గత నెల 27న కుప్పంలో ఆయన తీవ్ర గుండెపోటుకు గురై, గత కొన్నివారాలుగా ఆయన మృత్యువుతో పోరాడుతున్నారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన పరిస్థితి అత్యంత విషమం అంటూ ఈ ఉదయం నుంచే కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తారకరత్న ఇక లేరంటూ వైద్యులు ప్రకటించినట్టు తెలుస్తోంది.
జనవరి 27న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కుప్పంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తారకరత్న కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాదయాత్ర సాగుతుండగా తారకరత్న ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటీన కుప్పంలో కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ్నించి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి గ్రీన్ చానల్ ద్వారా వేగవంతంగా తరలించారు. అప్పటి నుంచి తారకరత్నకు అక్కడే చికిత్స జరుగుతోంది.
గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాల పాటు రక్తప్రసరణ ఆగిపోవడంతో, మెదడులోని కొంత భాగం డ్యామేజికి గురైనట్టు వైద్యులు గుర్తించారు. సంబంధిత నిపుణులు చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
ఓ దశలో తారకరత్నను విదేశాలకు తీసుకెళతారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత విదేశీ వైద్య నిపుణులనే బెంగళూరు రప్పించారు. అంతేకాదు, తారకరత్నను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తారంటూ నేడు ప్రచారం జరిగింది. కానీ అందరినీ విషాదంలో ముంచెత్తుతూ తారకరత్న తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. గత 23 రోజులుగా ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన కృషి నిష్ఫలమైంది.