Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చనిపోయాడనుకున్న కొడుకు 15 సంవత్సరాల తర్వాత తిరిగొచ్చాడు… !

పదేళ్ల వయసులో పాము కాటుకు గురై మరణించిన కుర్రాడు.. 15 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం!

  • ఉత్తరప్రదేశ్‌లోని భగల్పూర్ జిల్లాలో ఘటన
  • పాముకాటుతో బాలుడు మృతి చెందినట్టు వైద్యుల నిర్ధారణ
  • కుటుంబ సంప్రదాయం ప్రకారం కుమారుడిని అరటిబోదెలకు కట్టి సరయు నదిలో విడిచిపెట్టిన వైనం
  • మెలకువ వచ్చేసరికి బీహార్‌లోని పాట్నాలో
  • చికిత్స చేసి పెంచి పెద్దచేసిన పాములు పట్టే వ్యక్తి

పదేళ్ల ప్రాయంలో పాము కాటుకు గురై మరణించిన చిన్నారి 15 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే.. నమ్మశక్యంగా లేదు కదూ! కానీ, ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా భగల్పూర్‌ బ్లాక్‌లో జరిగింది ఇదే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మురాసో గ్రామానికి చెందిన అంగేశ్ యాదవ్ 15 ఏళ్ల క్రితం పాముకాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు తమ సంప్రదాయం ప్రకారం కుమారుడిని అరటిబోదెలకు కట్టి సరయు నదిలో విడిచిపెట్టారు. ఈ ఘటన జరిగి ఇప్పటికి 15 ఏళ్లు అయింది. తాజాగా, ఆదివారం అంగేశ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని గుర్తు పట్టి వెంట తీసుకెళ్లారు.

ఇక, నాడు ఏం జరిగిందన్న విషయాన్ని అంగేశ్ పూసగుచ్చినట్టు వివరించాడు. పాముకాటు తర్వాత ఏం జరిగిందన్న విషయం తనకు గుర్తు లేదన్నాడు. కానీ, తనకు మెలకువ వచ్చేసరికి బీహార్ రాజధాని పాట్నాలో పాములు పట్టే వ్యక్తి తనకు చికిత్స అందిస్తూ కనిపించాడన్నాడు. ఆ తర్వాత అతడే తనను పెంచి పెద్ద చేసినట్టు చెప్పాడు. ఈ క్రమంలో పంజాబ్‌లోని ఓ భూస్వామి వద్ద అంగేశ్ పనికి కుదిరాడు.

ఓసారి తన జీవితం గురించి ఓ లారీ డ్రైవర్‌కు చెప్పడంతో అంగేశ్‌ను అతడు ఆజంగఢ్ తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అక్కడి వారితో అంగేశ్ తన కథను పంచుకున్నాడు. గ్రామస్థుల్లో ఒకరు అంగేశ్ ఫొటో తీసి మురసో గ్రామంలో తనకు తెలిసిన వారికి పంపించాడు. ఆ ఫొటో చూసిన అతడి తల్లి కుమారుడిని గుర్తుపట్టి కుటుంబ సభ్యులతో కలిసి మనియార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ అంగేశ్ వారిని గుర్తుపట్టడంతో పోలీసులు అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కథ సుఖాంతం అయింది.

Related posts

ఇప్పటం గ్రామస్తులకు మరోసారి ఎదురుదెబ్బ… పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు!

Drukpadam

రాజద్రోహ చట్టం అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు!

Drukpadam

బీజేపీ విధానాలపై సీపీఎం ప్రజాగర్జన….తమ్మినేని

Drukpadam

Leave a Comment