లాక్ డౌన్ విధింపుపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఆలస్యంగానైనా లాక్ డౌన్ విధించారు
- కరోనా పేషెంట్ల ప్రయాణాలకు అంతరాయం కలగకుండా చూడాలి
- వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము మద్దతిస్తామని చెప్పారు. లాక్ డౌన్లకు సంబంధించి రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాధికారాన్ని అప్పజెప్పిందని తెలిపారు. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్ ను ప్రకటించాయని… తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగానైనా లాక్ డౌన్ ప్రకటించిందని అన్నారు.
లాక్ డౌన్ సమయంలో కరోనా టెస్టులు, రోగులకు చికిత్స ఆగకుండా చూడాలని ప్రభుత్వాన్ని సంజయ్ కోరారు. పేషెంట్ల ప్రయాణాలకు ఆటంకం కలగకూడదని చెప్పారు. వ్యాక్సిన్ మాత్రమే కరోనాను కట్టడి చేయగలదని… అందువల్ల లాక్ డౌన్ సమయంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగకుండా వేగంగా కొనసాగేలా చూడాలని సూచించారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను కేంద్రం ఇప్పటికే పంపించిందని… వీటి పంపిణీ కోసం ప్రత్యేక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.