ఈ నెల 6న బ్రిటన్ పార్లమెంట్ లో ప్రసంగించనున్న రాహుల్ గాంధీ!
- పది రోజుల పర్యటన కోసం యూకేలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత
- కేంబ్రిడ్జి యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడిన రాహుల్
- యూకే ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్న రాహుల్
భారత్ జోడో యాత్ర తర్వాత తన లుక్ మార్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. పది రోజుల ఈ పర్యటనలో వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. శుక్రవారం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ ఇప్పుడు బ్రిటన్ పార్లమెంట్ లో ప్రసంగించనున్నారు. ఈ నెల ఆరో తేదీన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లోని గ్రాండ్ కమిటీ గదిలో బ్రిటన్ ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ అయిన వీరేంద్ర శర్మ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రాజకీయాలు మాత్రమే కాకుండా ఇరు దేశాల సంబంధాలు, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే బ్రిటన్ నాయకులు, ప్రభుత్వాలతో ఎలాంటి వైఖరి ఉంటుందనే అంశాలపై రాహుల్ మాట్లాడే అవకాశం ఉంది. అలాగే, బ్రిటన్ లో ప్రవాస భారతీయులతో కూడా రాహుల్ సమావేశం కానున్నారు. దాంతో పాటు ఇండియన్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటు చేసే మీడియా సమావేశానికి హాజరవుతారు. లండన్ లో ప్రముఖ వ్యాపారవేత్తలతోనూ రాహుల్ ప్రైవేట్ బిజినెస్ మీటింగ్ లో కూడా పాల్గొంటారు.