రాహుల్ ప్రధాని అవతారనే భయంతోనే బిజెపి అరాచకం:
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యరావు
వైరా లో హాథ్ సే హాథ్ జోడో యాత్ర
రేణుక నడిపిన ట్రాక్టర్ ఢీకొని నాయకునికి గాయాలు
వైరా, ముద్ర: రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని భయంతోనే బిజెపి అరాచక ఆలోచనతో ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యరావు అన్నారు. రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి నిరసిస్తూ దేశంలోని కాంగ్రెస్ ఎంపీలు అంతా మూకుమ్ముడిగా తమ పదవులకు రాజీనామా చేయాలని కోరారు. వైరాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హాథ్ సే హాథ్ జోడో యాత్ర , పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్
మాణిక్యరావు మాట్లాడారు. దేశ ప్రజలను పేదరికం నుంచి కాపాడేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4,000 కిలో మీటర్లు దూరం రాహుల్ గాంధీ జోడ యాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. ప్రధాని లక్షల కోట్ల రూపాయలను బ్యాంకు నుంచి లూటీ చేసి వేర్వేరు కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఈ విషయం దేశ ప్రజలకు తెలుసని అన్నారు. ఆదాని దోపిడీ చేసిన లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో బిజెపి, కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన అదానికి బిజెపి అండగా నిలిచిందని విమర్శించారు. రాహుల్ కి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలు గుర్తించి ఆయన కు ప్రతి ఒక్కరు అండగా ఉండాలని కోరారు. రాహుల్ గాంధీని బెదిరించేందుకే ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి జైలుకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బిజెపికి, కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తి లేదన్నారు. రాహుల్ గాంధీ పోరాట స్ఫూర్తి స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పోరాట స్ఫూర్తిని గుర్తు చేస్తుందని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాహుల్ గాంధీకి అండగా నిలిచారన్నారు. దేశంలోని బిజెపి వ్యతిరేక పార్టీలన్ని ఏకమై రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలన్నారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుక చౌదరి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఓ దుర్మార్గుడు మంత్రిగా పని చేస్తూ గుట్టలను ఆక్రమించి మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధరణి వెబ్సైట్ ద్వారా కూలీల భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ నేత సీఎం కేసీఆర్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు రామ్మూర్తి నాయక్, రంగారావు రాధా కిషోర్, కృష్ణ, సుదర్శన్, మంజుల, రామారావు పాల్గొన్నారు.
కార్పొరేటర్ భర్తకు తీవ్ర గాయాలు:
మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి ఆదివారం ఖమ్మం జిల్లా వైరాలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యరావు ఇతర నేతలు హాజరయ్యారు సభకు ముందు వైరా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రేణుక చౌదరి ట్రాక్టర్ నడిపారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రేణుక నడుపుతున్న ట్రాక్టర్ కింద ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ వహీదా భర్త కాంగ్రెస్ నాయకులు ముస్తఫా కాలు మీదకి ఎక్కటంతో గాయపడ్డడు. వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు, కార్యకర్తలు హుటాహుటిన అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ముస్తఫా కాలుకు తీవ్ర గాయం అయింది.