Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

రఘురామ అరెస్ట్ పై భిన్న స్వరాలు…!

రఘురామ అరెస్ట్ పై భిన్న స్వరాలు…!
-కాళ్లకు గాయాలతో కనిపించిన రఘురామ
-సీఐడీ కోర్టుకు కుంటుతూ వచ్చిన వైనం
-పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆరోపణ
-రఘురామ పరిస్థితిపై విచారం వ్యక్తం చేసిన నేతలు
చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్న మంత్రి తానేటి వనిత
-ప్రశాంతంగా ఉండే జిల్లాలో చీడపురుగులా తయారైయ్యారు.మంత్రి శ్రీ రంగనాథరాజు
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజును నిన్న హైదరాబాదులోని గచ్చీబౌలి నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను విజయవాడ తరలించిన సీఐడీ అధికారులు నేడు కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టుకు వచ్చిన సందర్భంగా రఘురామకృష్ణరాజు కుంటుతూ, సరిగా నడవలేని స్థితిలో కనిపించారు. తనను పోలీసులు దారుణంగా కొట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, రఘురామకృష్ణరాజుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని టీడీపీ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు చేయాల్సిన పోలీసులు జగన్ కార్యకర్తల్లా అరాచకాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఒక ఎంపీని కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకే ఈ పరిస్థితి ఎదురైతే, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు, ప్రజలకు ఇంకెక్కడి రక్షణ? అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఐపీసీ సెక్షన్ల బదులు వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయని విమర్శించారు.

ఏపీలో అరాచకపాలనపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్, గవర్నర్ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేంద్ర బృందాలతో న్యాయ విచారణ జరిపించాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా ఇదే తరహాలో స్పందించారు. జగన్ సీఐడీని కక్ష సాధింపు సంస్థగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఘోరమని అభిప్రాయపడ్డారు.

అటు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ కూడా రఘురామ వ్యవహారంలో సీఐడీ తీరును ఖండించారు. రఘురామకృష్ణరాజును చిత్రహింసల పాల్జేయడాన్ని ఖండిస్తున్నట్టు పురందేశ్వరి తెలిపారు. ఎవరైనా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారి పట్ల ఏపీ సీఎం అసహనాన్ని ఈ ఉదంతం వెల్లడిస్తోందని తెలిపారు. ఇది సంపూర్ణ ప్రజాస్వామ్య హననం అని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు.

సునీల్ దేవధర్ కూడా ఏపీ సీఐడీ పోలీసుల తీరును తప్పుబట్టారు. ఇప్పటిదాకా ప్రజలు వైసీపీని ఓ రౌడీ పార్టీ అని భావించేవారని, ఇప్పుడు పోలీసులు కూడా ఓ రౌడీ వ్యవస్థను తలపిస్తున్నారని విమర్శించారు. మతమార్పిడి మాఫియాకు వ్యతిరేకంగా గళం విప్పినందుకు ఇది ప్రతీకార్య చర్యనా? అంటూ సునీల్ దేవధర్ ట్వీట్ చేశారు.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె .రామకృష్ణ కూడా ఎంపీ రఘురామ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్, తదనంతర పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఏపీలో నెలకొన్న రాజ్యాంగ అస్థిర చర్యలపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్, సీఐడీ, ఏసీబీ వ్యవస్థలు సీఎం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు. కోర్టులు, గవర్నర్ చెప్పినా వినే స్థితిలో సీఎం లేరని అయ్యన్న విమర్శించారు. ఓ ఎంపీని అరెస్ట్ చేసేముందు లోక్ సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి అనుమతి తీసుకోవాలి కదా? అని ప్రశ్నించారు.

అయినా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల్లో తప్పేముందని అన్నారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడం తప్పెలా అవుతుందని నిలదీశారు. గతంలో చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు చేసినప్పుడు సీఐడీకి వినిపించలేదా? అని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామపై అధికార పార్టీ సోషల్ మీడియా ఖాతాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టించింది సజ్జల కాదా? అని ప్రశ్నించారు.
ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఎం జగన్ కక్ష కట్టారని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం వల్లే రఘురాజును అరెస్ట్ చేశారని అన్నారు. రఘురాజు పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు అంగీకరించిందని… దీంతో, దేశ వ్యాప్తంగా జగన్ అభాసుపాలయ్యారని చెప్పారు. ముద్దాయిల స్థాయిని న్యాయ వ్యవస్థ పట్టించుకోకూడదని… విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల పట్ల వ్యత్యాసం చూపకూడదని అన్నారు. కక్ష పూరిత చర్యలను జగన్ మానుకోవాలని సూచించారు.
దీంతో ఏపీ స‌ర్కారు తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిప‌డ్డారు. స‌ర్కారు పాల్ప‌డుతోన్న తప్పులను ఎత్తి చూపిన వారిపై బెదిరింపులకు, అక్రమ అరెస్టులకు పాల్పడటం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హ‌రించేలా జ‌రుగుతోన్న‌ ఇలాంటి ఘటనలు ప్ర‌మాద‌కరమ‌ని విమ‌ర్శించారు.

గుంటూరు సీఐడీ కోర్టులో రఘురామకృష్ణరాజును ఏ1 నిందితుడిగా ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తికి అందజేశారు. ప్రొసీడింగ్స్ పై అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వివరాలు తెలిపారు. రఘురామకృష్ణరాజును పోలీసులు కొట్టారనడం ఓ కల్పితగాథ అని పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజుకు కుటుంబ సభ్యులు మధ్యాహ్న భోజనం తీసుకువచ్చారని, అప్పటివరకు బాగానే ఉన్న ఆయన, ఆ తర్వాత కొత్త నాటకం షురూ చేశారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు.

హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో కొత్త ఆరోపణలు చేస్తున్నారని, కోర్టును తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. రఘురామ గాయాలపై రేపు మధ్యాహ్నం నివేదిక వస్తుందని తెలిపారు. కోర్టు నియమించిన మెడికల్ కమిటీ ఆ నివేదిక రూపొందిస్తుందని వెల్లడించారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది: ఏపీ మంత్రి తానేటి వనిత

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రఘురాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పెట్టిన భిక్షతోనే ఆయన ఎంపీ అయ్యారని చెప్పారు. ప్రజాప్రతినిధికి సరైన భాష, వ్యవహారశైలి ఉండాలని… అయితే ఈ లక్షణాలు ఆయనలో లేవని విమర్శించారు. ఎంపీగా గెలిచి రెండేళ్లు అవుతున్నా సొంత నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.

ప్రజా సంక్షేమాన్ని రఘురాజు వదిలేశారని… సొంత పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని వనిత అన్నారు. ఆయనకు ఉన్న స్థాయిని కూడా మర్చిపోయి… టీడీపీ ఇచ్చిన స్క్రిప్టును చదువుతూ మాట్లాడుతున్నారని విమర్శించారు. రఘురాజు అరెస్ట్ ను తామంతా సమర్థిస్తున్నామని చెప్పారు. రఘురాజులాంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని… ఆయన వెనకున్న వాళ్లందరూ ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.

ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని రఘురాజు గత 14 నెలలుగా గాలికొదిలేశారని… ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ప్రశాంతంగా ఉండే జిల్లాలో ఆయన ఒక చెద పురుగులా తయారయ్యారని అన్నారు. రఘురాజుపై తాను కూడా కేసు పెట్టానని తెలిపారు. ప్రజల మనోభావాలను ఆయన అర్థం చేసుకోవడం లేదని దుయ్యబట్టారు. రఘురాజు అరెస్ట్ అలాంటి వ్యక్తులందరికీ ఒక గుణపాఠం కావాలని అన్నారు.

Related posts

కారును దగ్ధం చేసిన మావోయిస్టులు! ఏజన్సీ ఏరియాలో కలకలం

Ram Narayana

కాంగ్రెస్ లో ఎవరికీ వారే యమునాతీరే…

Drukpadam

వి.హనుమంతరావుకు ఫోన్ చేసిన సోనియాగాంధీ…

Drukpadam

Leave a Comment