Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హత్యాప్రయత్నాల నుంచి ఆరుసార్లు తప్పించుకున్న పుతిన్…!

హత్యాప్రయత్నాల నుంచి ఆరుసార్లు తప్పించుకున్న పుతిన్…!

  • క్రెమ్లిన్ పై డ్రోన్ దాడిని అడ్డుకున్న రష్యా ఆర్మీ
  • గతంలో పుతిన్ అజర్ బైజాన్ పర్యటనలో పేలుళ్లకు కుట్ర
  • మాస్కోలోనూ పేలుడు పదార్థాలతో దాడికి యత్నం
  • బ్రిటన్ లో రష్యా సీక్రెట్ సర్వీస్ మాజీ అధికారి అరెస్ట్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై బుధవారం హత్యాయత్నం జరిగిందని రష్యా ఆర్మీ బుధవారం ప్రకటించింది. అధ్యక్ష భవనంపై రెండు డ్రోన్లతో దాడి చేసే ప్రయత్నం జరిగిందని, వాటిని గాలిలోనే పేల్చేశామని వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా మీడియాకు విడుదల చేసింది. ఇది ఉక్రెయిన్ పనేనని ఆరోపిస్తూ.. ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇందులో భాగంగా గురువారం ఉక్రెయిన్ లోని ఖేర్సన్ పై తీవ్ర దాడులు చేసింది. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ను హత్య చేసేందుకు గతంలోనూ పలు ప్రయత్నాలు జరిగాయి. ఒకటి రెండుసార్లు కాదు.. ఏకంగా ఆరుసార్లు దాడికి ప్రయత్నం జరగగా పుతిన్ తప్పించుకున్నారు.

  • పుతిన్ పై తొలిసారి 2002 లో హత్యాయత్నం జరిగింది. అప్పట్లో అజర్ బైజాన్ లో పుతిన్ పర్యటించారు. ఈ పర్యటనలో పుతిన్ ను చంపేయాలని కొంతమంది కుట్ర పన్నారు. అవసరమైన పేలుడు పదార్థాలు కూడా సమకూర్చుకున్నారు. అయితే, చివరి నిమిషంలో ఈ విషయం తెలిసి పుతిన్ బాడీగార్డులు అలర్ట్ అయ్యారు. పలుచోట్ల సోదాలు జరిపి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పుతిన్ ఈ హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది.
  • అదే ఏడాదిలో మరోమారు పుతిన్ పై అటాక్ ప్లాన్ జరిగింది. పుతిన్ స్వయంగా కారు నడుపుకుంటూ మాస్కోలో పర్యటించాల్సి ఉండగా.. అధ్యక్ష భవనం వైపు ఓ ఆగంతుకుడు కారులో దూసుకొచ్చాడు. తాను రష్యా అధ్యక్షుడినని చెప్పుకుంటూ.. తనను పుతిన్ దగ్గరకు తీసుకెళ్లాలని భద్రతా సిబ్బందితో గొడవపడ్డాడు. ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని భావించి పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పుతిన్ ప్రయాణించాల్సిన మార్గంలో తనిఖీ చేయగా.. 40 కిలోల పేలుడు పదార్థాన్ని గుర్తించి, నిర్వీర్యం చేశారు. దీంతో రెండోసారి పుతిన్ కు ప్రమాదం తప్పింది.
  • 2003లో పుతిన్ బ్రిటన్ పర్యటన సందర్భంగా మరోమారు హత్యాయత్నం జరిగింది. పుతిన్ హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలతో బ్రిటన్ యాంటీ టెర్రర్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు రష్యా సీక్రెట్ సర్వీస్ మాజీ ఏజెంట్ అని తేలింది. పుతిన్ ను హత్య చేసేందుకు అతడు స్నైపర్ తుపాకీతో మాటు వేసినట్లు విచారణలో బయటపడింది.
  • 2012లో రష్యా అధ్యక్ష ఎన్నికల సందర్బంగా పుతిన్ ను తుదముట్టించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను రష్యా పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఒకరు ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
  • 2022లో ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. దాడులు మొదలుపెట్టిన తొలి రోజుల్లో పుతిన్ కాకసస్ లో పర్యటించారు. ఈ పర్యటనలో పుతిన్ ను చంపేందుకు ప్రయత్నించామని, కాకసస్ లోని స్థానికుల సాయంతో దాడి చేశామని ఉక్రెయిన్ ఇంటలిజెన్స్ చీఫ్ కైరియలో బుదనోవ్ తెలిపారు. అయితే, ఈ విషయాన్ని రష్యా రహస్యంగా ఉంచింది. దాడికి సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించలేదు.
  • తాజాగా బుధవారం క్రెమ్లిన్ పై రెండు డ్రోన్లతో దాడి జరిగింది. డ్రోన్లు గాలిలో ఉండగానే రష్యా అధికారులు గుర్తించి పేల్చేశారు. ఈ దాడి వెనక ఉక్రెయిన్ ఉందని, పుతిన్ ను చంపేందుకే డ్రోన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. డ్రోన్ దాడి సమయంలో పుతిన్ అధ్యక్ష భవనంలో లేరని సైనిక అధికారులు తెలిపారు.

Related posts

ఖమ్మం లో పాత బస్ స్టాండ్ పరిరక్షణ సమితి ఉద్యమం ఉద్రిక్తం…

Drukpadam

50 లక్షలు ఖర్చు చేసినా దక్కని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం…

Drukpadam

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా శ్యామ్యూల్… ?

Drukpadam

Leave a Comment