సీబీఐ నా స్టేట్ మెంట్ తీసుకుందనేది అవాస్తవం.. అది కేవలం చిట్ చాట్ మాత్రమే: అజయ్ కల్లం….
- ఎస్పీతో చిట్ చాట్ గా మాట్లాడానన్న ప్రభుత్వ సలహాదారు
- ఓ మీడియా సంస్థ కథనంపై గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు
- వివేకా చనిపోయిన విషయం సీఎం జగన్ చెప్పారని వెల్లడి
- ఎలా చనిపోయారని ఎస్పీ అడగలేదు, తాను చెప్పలేదని వివరణ
- సీబీఐ అధికారితో ఏం మాట్లాడాననేది బయటకు వెల్లడించకూడదు కానీ, చెప్పేలా చేశారని వ్యాఖ్య
- ఈ విషయం తన భార్యకూ తెలియదని చెప్పిన అజయ్ కల్లం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంపై ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం తొలిసారిగా స్పందించారు. ఈ కేసులో సీబీఐ అధికారులు ఆయన స్టేట్ మెంట్ తీసుకున్నారు అంటూ ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించడంపై అజయ్ కల్లం స్పందించారు. గురువారం ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. సీబీఐ తన స్టేట్ మెంట్ తీసుకుందనేది అవాస్తవమని స్పష్టం చేశారు.
సీబీఐకి చెందిన ఎస్పీ ఒకరు ఇటీవల తన ఇంటికి వచ్చారని అజయ్ కల్లం తెలిపారు. ఇంటికి వచ్చే ముందు తనకు మెసేజ్ చేశారని, వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఐదు నిమిషాలు చిట్ చాట్ చేయాలని వస్తున్నట్లు అందులో చెప్పారన్నారు. ఆయనను ఇంట్లోకి ఆహ్వానించి, కాఫీ తాగుతూ మాట్లాడుకున్నామని అజయ్ కల్లం చెప్పారు. ‘‘ఆ రోజు మీటింగ్ కు నలుగురం హాజరయ్యాం. దాదాపు గంట, గంటన్నరో నాకు సరిగా గుర్తులేదు.. గడిచాక ‘వైఎస్ వివేకా ఈజ్ నో మోర్’ అని సీఎం జగన్ చెప్పారు. దీంతో మేం లేచి వచ్చేశాం. ఆ న్యూస్ తో మేమంతా షాక్ అయ్యాం’’ అని సీబీఐ ఎస్పీతో చెప్పినట్లు అజయ్ కల్లం పేర్కొన్నారు.
అయితే, వివేకా ఎలా చనిపోయాడు, కారణమేంటి, గుండెపోటా మరొకటా అని సీబీఐ ఎస్పీ అడగలేదు, తాను చెప్పలేదని అజయ్ కల్లం పేర్కొన్నారు. చిట్ చాట్ గా మాట్లాడే విషయాలను ఎవిడెన్స్ గా పరిగణించరని, వాటికి ఆధారం ఉండదని వివరించారు. ఇలాంటి సంభాషణల ద్వారా ఏదైనా లీడ్ దొరకవచ్చనే ఉద్దేశంతోనే అధికారులు కలుస్తారని అజయ్ కల్లం చెప్పారు.
సీబీఐ ఎస్పీతో తాను చేసిన చిట్ చాట్ ను ఓ మీడియా సంస్థ స్టేట్ మెంట్ ఇచ్చారని కథనం ప్రచురించిందని అజయ్ కల్లం చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ ఆ కథనంలో ప్రచురించిన విషయాలు ఊహాజనితాలేనని వివరించారు. సీబీఐ అధికారితో మాట్లాడిన విషయం తన భార్యకే తెలియదని, కాన్ఫిడెన్షియల్ కాబట్టి రహస్యంగా ఉంచానని చెప్పారు. ఆ మీడియా కథనం ప్రచురించడంతో ఇప్పుడు బయటకు వెల్లడించాల్సి వస్తోందని అన్నారు.
విశ్వసనీయ సమాచారం అంటూ రాసే కథనాలపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అజయ్ కల్లం చెప్పారు. ఇలాంటి రాతలవల్ల సీబీఐ క్రెడిబిలిటీ పోతుందని అన్నారు. ఏ విచారణ సంస్థ అయినా సరే తాను సేకరించిన సమాచారం కానీ, తీసుకున్న స్టేట్ మెంట్ కానీ, విచారణలో బయటపడ్డ వివరాలు కానీ కోర్టులకు తప్ప బయట వెల్లడించకూడదని అజయ్ కల్లం చెప్పారు. తాజా కథనం నేపథ్యంపై సీబీఐ స్పందించాల్సిన అవసరం ఉందని అజయ్ కల్లం చెప్పారు.