Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఓ పక్క మీసం మెలేస్తారు… మరో పక్క అరికాలు ఎత్తి చూపిస్తారు: రఘురామపై సజ్జల వ్యాఖ్యలు

ఓ పక్క మీసం మెలేస్తారు… మరో పక్క అరికాలు ఎత్తి చూపిస్తారు: రఘురామపై సజ్జల వ్యాఖ్యలు
రఘురామ అరెస్ట్ పరిణామాలపై సజ్జల స్పందన
అనేక అనుమానాలు కలుగుతున్నాయని వెల్లడి
దీని వెనుక కుట్రకోణం ఉందని వ్యాఖ్యలు
లేనిపోనివన్నీ సీఎంకు ఆపాదిస్తున్నారని మండిపాటు
ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు, తదనంతర పరిణామాలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రఘురామకృష్ణరాజు తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. కోర్టుకు హాజరైన సందర్భంగా రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు కూడా వచ్చారని, భోజనం కూడా తెచ్చారని వివరించారు. హైకోర్టులో వ్యతిరేక ఫలితం వచ్చిన వెంటనే డ్రామా మొదలైందని అన్నారు. రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ప్రభుత్వ ప్రమేయం లేదు కాబట్టే ఇంత రచ్చ చేస్తున్నారు… పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం కాబట్టే ఇంత చర్చ జరుగుతోందని అని వివరించారు.

“రఘురామ ఓ పక్క మీసం మెలేస్తారు… మరో పక్క అరికాలు ఎత్తి చూపిస్తారు. మళ్లీ కారు దిగిన తర్వాత నడవలేనట్టుగా భుజంపై ఆసరాతో వెళతారు. ఈ వ్యవహారం మొత్తంలో ఎక్కడైనా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడమో లేక, మానవ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడమో చేయలేదే! మొదట్నించి ఈ పచ్చ మూకలు ఏ విషయాన్నయినా దుష్ప్రచారం చేస్తున్నాయి. లేనిపోనివన్నీ సీఎంకు ఆపాదించడం, బురద చల్లాలని చూడడం దుర్మార్గం. టీడీపీకి మొదటి నుంచి ఇది అలవాటే. వాళ్లకు తెలిసింది ఇదొక్కటే” అని విమర్శించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపైనా సజ్జల వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణరాజు కేసులో రాజద్రోహం అంటే ఏంటో తనకు తెలియదని, అసలా పదమే తాను వినలేదని చంద్రబాబు అంటున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు హయాంలోనే కేసీఆర్ పై 12 పర్యాయాలు రాజద్రోహం కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. మరి ఆ రోజు ఇది రాజకీయమని, దాన్ని రాజకీయంతోనే తేల్చుకోవాలని చంద్రబాబుకు అనిపించలేదా అని సజ్జల ప్రశ్నించారు. దేన్నైనా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవచ్చని, అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత విద్వేషాలతో ఎప్పుడూ పైచేయి సాధించలేరు, ఈ విషయాన్ని జగన్ గుర్తించి వాటికి దూరంగా ఉంటారని వెల్లడించారు.

రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేసింది ముఖ్యమంత్రిపైనే కాకుండా కులాలు, మతాలు, ప్రభుత్వ పథకాలపైనా వ్యాఖ్యలు చేశాడని వివరించారు. మానసిక స్థితి సరిగాలేకనో, ఆక్రోశం భరించలేకనో అన్నాడంటే సరిపెట్టుకోవచ్చు… కానీ రఘురామ వ్యాఖ్యల వెనుక కుట్రకోణం ఉంది అని ఆరోపించారు. రెండు చానళ్లు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రోత్సహించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మా పార్టీ నుంచి దూరమైన రఘురామను ఓ పావులా వాడుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. ఎక్కడ తమ బండారం బయటపడుతుందనే మధ్యలో జోక్యం చేసుకుంటున్నారని అన్నారు. వీళ్లపై కేసులు నమోదు కాకముందే భుజాలు తడముకుంటున్నారని విమర్శించారు.

Related posts

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్షాల పయనమెటు ?

Drukpadam

మాయల పకీరు మాటలు నమ్మొదు…పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ram Narayana

చిరు వ్యాపారులపై కేంద్రం వివక్ష వారికీ అండగా నిలుద్దాం :స్టాలిన్

Drukpadam

Leave a Comment