కేరళ మాజీ మంత్రి శైలజకు పెరుగుతున్న మద్దతు..
-మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందేనంటున్న సినీ తారలు
-పినరయి కేబినెట్‌లో శైలజకు దక్కని చోటు
-ఆమెకు మద్దతుగా ఒక్కటైన సోషల్ మీడియా
-ఆమెకు అన్యాయం జరిగిందన్న నటి పార్వతి
కేరళలో వరసగా రెండవసారి సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం కొలువు దిరుగున్న వేళ నూతన మంత్రి వర్గంలోకి శైలజ టీచర్ ను తీసుకోవాల్సిందేనని డిమాండ్స్ అధికమౌతున్నాయి. ఈ సారి మంత్రి వర్గంలోకి తమపార్టీ నుంచి అందరిని కొత్తవారిని తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు అందరిని మరచి కొత్తవారికి అవకాశం కల్పించారు . అందులో ప్రధానంగా కరోనా సమయంలో అద్భుతంగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్న శైలజ టీచర్ ను మంత్రి వర్గంలోకి తీసుకోక పోవడంపై సినీ తారలు , నెటిజన్లు మండి పడుతున్నారు.
కరోనా వైరస్ తొలి దశలో అద్భుతంగా పనిచేసి దానికి అడ్డుకట్ట వేసిన కేరళ మాజీ మంత్రి కేకే శైలజకు ఈసారి మంత్రివర్గంలో చోటు లభించలేదు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈసారి తన కేబినెట్‌లో దాదాపు అందరినీ కొత్తవారినే తీసుకున్నారు.కొత్త వారిని మాత్రమే తీసుకోవాలనే పెట్టుకున్న నిబంధన పై విమర్శలు వస్తున్నాయి.
శైలజ లాంటి వారికి తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలువురు సినీ తారలు కూడా ఆమెకు మద్దతు పలుకుతున్నారు. #BringBackShailajaTeacher, #BringOurTeacherBack వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. మహిళల హక్కులపై గొంతెత్తే మలయాళీ నటి పార్వతి, అనుపమ పరమేశ్వరన్, మాళివిక మోహనన్ తదితరులు ట్విట్టర్ వేదికగా శైలజకు మద్దతు పలుకుతున్నారు. ఆమెను తిరిగి కేబినెట్‌లోకి తీసుకోవాలంటూ సీఎంపై ఒత్తిడి పెంచుతున్నారు.
మంత్రివర్గంలో శైలజ తప్పకుండా ఉండాల్సిన వ్యక్తి అని, ఆమెకు అన్యాయం జరిగిందని పార్వతి తన ట్వీట్లలో పేర్కొన్నారు. శైలజ లాంటి ఉత్తమమైన నేత అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు. మట్టనూర్ నియోజకవర్గం నుంచి ఆమె 60 వేల భారీ మెజారిటీతో విజయం సాధించారని, కేరళలోని 140 స్థానాల్లో అదే అత్యధికమని గుర్తు చేశారు. అయినా సరే ఆమెకు మంత్రి పదవి కోసం పోరాడాల్సి వస్తోందని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత విపత్కర సమయంలో ఆరోగ్యశాఖ మంత్రికి చోటు కల్పించకపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మాళవిక మోహనన్ అన్నారు. అసలు పినరయి విజయన్‌కు ఏమైందని ఆమె ప్రశ్నించారు. అనుపమ పరమేశ్వరన్ కూడా శైలజకు మద్దతుగా ట్వీట్ చేశారు.
కేరళలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ 21 మంది కొత్త ముఖాలను తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. తొలి దశలో కరోనాను అడ్డుకోవడంలో శైలజ కీలక పాత్ర పోషించారు. వైరస్‌ను అద్భుతంగా నియంత్రించిన ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
అలాగే, ప్రాణాంతక నిపా వైరస్‌ను నియంత్రించడంలోనూ శైలజ అద్భుతంగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. ఈసారి కూడా ఆమెకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించారు. అయితే, ముఖ్యమంత్రి పినరయి విజయన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ కొత్త వారికి ఆరోగ్యశాఖ మంత్రి పదవిని అప్పగించారు.