Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబు ,రామోజీ రావులు కావాలనే దుష్ప్రచారం : సీఎం జగన్…

చంద్రబాబు ,రామోజీ రావు లు కావాలనే దుష్ప్రచారం : సీఎం జగన్…
-వ్యాక్సిన్లపై వీళ్లకు అన్నీ తెలుసు అధ్యక్షా… కానీ వక్రీకరిస్తున్నారు
-అసత్యాలతో ఆరోపణలు చేస్తున్నారని ధ్వజం
-వ్యాక్సిన్ గణాంకాలు అసెంబ్లీలో వివరించిన ఏపీ సీఎం
-గ్లోబల్ టెండర్లకు వెళ్లామని వెల్లడి
-ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టీకరణ
ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ముగింపు ప్రసంగం చేశారు. తమ పాలన చేపట్టిన తర్వాత సగర్వంగా మాట్లాడుతున్నామని సీఎం జగన్ ప్రసంగం ప్రారంభించారు. ఆపై కొవిడ్ బాధితులకు నివాళిగా కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన విపక్ష తెలుగుదేశం పార్టీపైనా, కొన్ని మీడియా సంస్థలపైనా విమర్శలు చేశారు. చంద్రబాబు ,రామోజీ రావు పేర్లను ప్రస్తావించారు. ఈ 14 నెలల్లో కరోనాపై రూ.2,229 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ వెల్లడించారు. అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు శక్తిమేర కృషి చేస్తున్నామని చెప్పారు.

“ఇవాళ్టి అసెంబ్లీ ద్వారా వ్యాక్సినేషన్ కు సంబంధించిన కొన్ని విషయాలను ప్రజలకు చెప్పదలచుకున్నాను. వ్యాక్సిన్ అంశంపై కొందరు పదేపదే వక్రీకరిస్తున్నారు. తెలిసి కూడా అబద్ధాలు చెబుతున్నారు. దేశంలో 45 ఏళ్లకు పైబడినవారు 26 కోట్ల మంది ఉన్నారు. ఆ 26 కోట్ల మందికి రెండు డోసులు అంటే 52 కోట్ల డోసులు వాళ్ల కోసమే కావాలి. ఇక 18 నుంచి 45 ఏళ్ల లోపు వాళ్లు దేశంలో 60 కోట్ల మంది ఉన్నారు. వాళ్లకు రెండు డోసులు ఇవ్వాలంటే 120 కోట్ల డోసులు కావాలి అధ్యక్షా.

ఓవరాల్ గా 172 కోట్ల డోసులు మనకు అవసరం అయితే, మనదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు కేవలం 7 కోట్ల డోసులే. వీటిలో 6 కోట్ల డోసులు సీరమ్ సంస్థ, 1 కోటి డోసులు భారత్ బయోటెక్ సంస్థ తయారుచేస్తున్నాయి. దేశానికి 172 కోట్ల డోసులు అవసరమైతే ఇప్పటివరకు వ్యాక్సినేషన్ జరిగింది 18 కోట్ల 44 లక్షల మందికి మాత్రమే.

ఇక మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే 45 ఏళ్లకు పైబడినవాళ్ల సంఖ్య 1.48 కోట్లు. వాళ్లందరికీ రెండు డోసులు అంటే 3 కోట్ల డోసులు కావాలి. 18 నుంచి 45 ఏళ్ల లోపు వాళ్లు 2 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ 4 కోట్ల డోసులు కావాలి. మొత్తమ్మీద రాష్ట్రానికి 7 కోట్ల డోసులు ఇవ్వాలి. కానీ కేంద్రం మనకు ఇచ్చింది 76 లక్షల 29 వేల 580 డోసులు మాత్రమే.

వాస్తవాలు ఇలావుంటే… కొందరు రాజకీయాలు చేస్తున్నారు. వారందరికీ ఈ వాస్తవాలు తెలుసు అధ్యక్షా. ఆరోపణలు చేసేవారందరికీ ఈ పరిస్థితులు తెలుసు. ఈ ఆరోపణలనే ఈనాడులో రామోజీరావు గారు రాస్తుంటారు. ఇదే రామోజీరావు కొడుకు వియ్యంకుడిదే ఈ భారత్ బయోటెక్. చంద్రబాబునాయుడికీ బంధువులు. మరి ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో వాళ్లకు తెలుసు కదా అధ్యక్షా.

తెలిసి కూడా… వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదు? డబ్బులు పెట్టి వ్యాక్సిన్లు ఎందుకు కొనడంలేదు? కమీషన్ల కోసం వ్యాక్సిన్లు కొనడంలేదని అంటున్నారు. కొవిడ్ సమయంలో ఈ దుర్మార్గపు ఆరోపణలు, వక్రీకరణలు చూస్తుంటే మనసుకు బాధ కలుగుతుంది అధ్యక్షా.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న తక్షణ ప్రాధాన్యత వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లకు వెళ్లడమే. గ్లోబల్ టెండర్లకు వెళ్లిన అతి తక్కువ రాష్ట్రాల్లో ఏపీ పైవరుసలో ఉంటుంది. దేవుడి దయతో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తాం. అది కూడా ఉచితంగానే. వ్యాక్సినేషన్ ను 50 శాతానికన్నా తీసుకెళితేనే సామూహిక వ్యాధినిరోధకశక్తి ఏర్పడుతుంది. కరోనాను నివారించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. వ్యాక్సినేషన్ వరకు మాస్కులు, భౌతికదూరం ఎలాగూ తప్పవు” అని వివరించారు.

హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాలు మన రాష్ట్రానికి లేవు

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. ఆరోగ్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతోందని భావిస్తున్న తరుణంలో ప్రపంచానికి కొవిడ్ ఓ సవాలుగా పరిణమించిందని అన్నారు. 2020 మార్చిలో ఏపీలో తొలి కరోనా కేసు నమోదైందని, ఆ సమయంలో కరోనా నిర్ధారణ కోసం ఆ శాంపిల్ ను పూణే పంపించాల్సి వచ్చిందని సీఎం జగన్ వెల్లడించారు. ఆ సమయంలో కనీసం కరోనా టెస్టులు కూడా చేయించలేని స్థితిలో మన రాష్ట్రం ఉందని తెలిపారు.

“ఇవాళ ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ అధీనంలో 150కి పైగా ల్యాబ్ లు కరోనా పరీక్షలు చేస్తున్నాయి. రోజుకు లక్షకు పైగా టెస్టులు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొవిడ్ తొలి వేవ్ సమయంలో 261 ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తే, ఇప్పుడు సెకండ్ వేవ్ నాటికి కరోనా చికిత్స అందించే ఆసుపత్రుల సంఖ్య 649 కంటే ఎక్కువగా ఉంది.

రాష్ట్ర విభజన నాటికి మనకు పెద్ద నగరం ఒక్కటీ లేదు. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల స్థాయిలో ఏపీలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ఆసుపత్రులు కలిగిన నగరాలు లేవు. రాష్ట్ర విభజన కారణంగా ప్రధాన నగరం అటువైపు వెళ్లిపోవడంతో నాణ్యమైన వైద్యసేవలకు కొరత ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో వైద్య రంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాం. జాతీయ స్థాయి ప్రమాణాలు అందుకునేలా మన ఆసుపత్రులను మలిచేందుకు నాడు-నేడు కార్యాచరణ తీసుకువచ్చాం” అని వివరించారు.

ప్రాణం విలువ నాకు బాగా తెలుసు: సీఎం జగన్

“ప్రాణం విలువ నాకు తెలుసు అధ్యక్షా. దివంగత మహానేత వైఎస్సార్ చనిపోయిన సమయంలో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిసి వారి కోసం ఏ రాజకీయ నేత చేయని విధంగా ఓదార్పు యాత్ర చేశాను. వారికి తోడుగా ఉండాలని నిర్ణయించుకుని ప్రతి కుటుంబాన్ని పరామర్శించాను. ప్రాణం విలువ తెలుసు కాబట్టే, ఆరోగ్యశ్రీని సమూలంగా మార్పులు చేశాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి రావాలని, ఆరోగ్యశ్రీ నామమాత్రంగా ఉండకుండా, ప్రాణంపోసే పథకంలా ఉండాలని ఆకాంక్షించాం.

రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నాం. మేం అధికారంలోకి రాకముందు ఆరోగ్యశ్రీలో 1000 చికిత్సలకే అనుమతి ఉంది. మేం వచ్చాక 2,400 జబ్బులకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 1180 అంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేసి ప్రతి మండలానికి చేరవేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్కులు తీసుకువస్తున్నాం. 90 రకాల రుగ్మతలకు అక్కడ ఔషధాలు లభిస్తాయి” అని వివరించారు

Related posts

తెలంగాణ లో బీజేపీ నాయకత్వ మార్పుపై ప్రచారం…లేదని కొట్టి పారేసిన కిషన్ రెడ్డి , తరుణ్ ఛుగ్…

Drukpadam

ప్రశ్నిస్తే పీడి కేసులు …నిలదీస్తే ఐటీ, ఈడీ దాడులపై భగ్గుమన్న భట్టి

Drukpadam

మీ ఆశీస్సులు మాకు అవసరం లేదు బెంగాల్ సీఎం కు స్పష్టం చేసిన విశ్వభారతి యూనివర్సిటీ …

Drukpadam

Leave a Comment