కెనడా అడవుల నుంచి వస్తున్న పొగ.. నార్వేలోనూ కనిపిస్తోంది!
- కొద్ది రోజులుగా కెనడాలోని అడవుల్లో మంటలు..
- గ్రీన్ ల్యాండ్, ఐస్ ల్యాండ్ లలోను పొగ
- వాతావరణంలో కలుగుతున్న మార్పుల గుర్తింపు
కెనడాలో భారీ స్థాయిలో కార్చిచ్చు రగులుతోంది. ఆ దావానలం నుండి దట్టమైన పొగ వస్తోంది. ఈ పొగ ఇప్పటికే అమెరికాలోని పలు నగరాలను కమ్మేసింది. దట్టంగా వ్యాపిస్తున్న ఆ పొగ ఇప్పుడు నార్వేలోను దర్శనమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని రోజుల నుండి కెనడాలోని అడవుల్లో అంటుకున్న మంటల నుండి వస్తోన్న పొగ ఇప్పుడు గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్‌లోనూ కనిపిస్తోంది. నార్వేలో ఉన్న క్లైమేట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆ కార్చిచ్చు పొగను డిటెక్ట్ చేసింది. సున్నితమైన పరికరాల ద్వారా వాతావరణంలో కలుగుతున్న మార్పులను గమనించారు.
నార్వే ప్రజలు స్వల్ప స్థాయిలో వాసనను, ఆకాశంలో స్మోక్‌ను చూడవచ్చునని ఎన్ఐఎల్‌యూ శాస్త్రవేత్త నికోలోస్ ఇవాంజిలియో తెలిపారు. చాలా దూరం నుంచి వస్తోన్న ఆ పొగ చాలా స్వల్పస్థాయిలో ఉంటుందన్నారు. రానున్న కొన్ని రోజుల్లో కెనడా నుండి వస్తున్న కార్చిచ్చు పొగ యూరోప్ మొత్తంగా వ్యాపించనున్నట్లు తెలుస్తోంది. కానీ ఆకాశంలో జరిగే ఆ మార్పును ప్రజలు గమనించలేకపోవచ్చునని ఇవాంజిలియో తెలిపారు. కెనడా అడవుల్లోంచి విడుదలైన పొగ చాలా ఎత్తు వరకు వెళ్తుందని, దాని వల్ల ఆ పొగ ఎక్కువ దూరం వ్యాప్తిస్తుందన్నారు.