Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రఘురామకృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు!

రఘురామకృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు!
-రఘురాజు మీడియా ముందుకు రాకూడదు
-విచారణకు పిలిచిన 24 గంటల్లో హాజరుకావాలి
-గాయాలను గతంలోలా ఎక్కడా ప్రదర్శించకూడదు
-రఘురాజుకు కస్టోడియల్ విచారణ అవసరం లేదు
-సుదీర్ఘంగా 2 .30 గంటలు సాగిన వాదనలు
ఆయనకు గాయాలు ఉన్నాయన్న ముకుల్ రోహాత్గీ
-గాయాలపై స్పష్టత లేదన్న దువే
-గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎక్సరే లో ఎలాంటి గాయం లేదు
-ఆయన కాలు పైకి ఎత్తి చూపడంపై అభ్యంతరం
-మొదట వాదనలు వినిపించిన రోహాత్గీ
-ఆపై దవేకు అవకాశమిచ్చిన సుప్రీం

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి.. రఘురాజు మీడియా లేదా సోషల్ మీడియా ముందు మాట్లాడకూడదని ఆదేశించింది. తనకు అయిన గాయాలను గతంలో చూపించినట్టుగా ఎక్కడా ప్రదర్శించకూడదని ఆదేశించింది. విచారణను ప్రభావితం చేసే పనులు చేయకూడదని చెప్పింది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదయిందని, కాబట్టి రాజుకు కస్టోడియల్ విచారణ అవసరం లేదని చెప్పింది. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని ఆదేశించింది.

విచారణకు పిలిచిన 24 గంటల్లో రఘురాజు హాజరు కావాలని… విచారణకు సంబంధించిన నోటీసును కూడా అధికారులు ఆయనకు 24 గంటల ముందుగానే ఇవ్వాలని సుప్రీం తెలిపింది. పోలీసు విచారణకు రఘురాజు సహకరించాలని ఆదేశించింది. పోలీసుల కస్టడీలో ఆయన పట్ల దురుసుగా వ్యవహరించారనే అభిప్రాయాన్ని న్యాయస్థానం వ్యక్తం చేసింది.

ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నామని సుప్రీం చెప్పింది. వారం రోజుల్లోగా లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారుల పూచీకత్తు ట్రయల్ కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇరువర్గాల సుదీర్ఘ వాదనలను వినింది. దాదాపు మూడు విడతలుగా కేసును విచారించింది.

సమయం ఎక్కువగా లేదు… త్వరగా వాదనలు వినిపించండి: రఘురామ బెయిల్ పిటిషన్ విచారణలో సుప్రీం వ్యాఖ్యలు

అంతకు ముందు సుప్రీం కోర్టులో రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో సుదీర్గంగా వాదోపవాదాలు సాగాయి. న్యాయమూర్తులు ప్రతివిషయాన్ని ఓపికగా విన్నారు. రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించిన అనంతరం ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఆయన వాదనల మధ్యలో జోక్యం చేసుకున్న సుప్రీం ధర్మాసనం… వాదనలు త్వరగా వినిపించాలని దవేకి స్పష్టం చేసింది. దాంతో ఆయన తన వాదనల్లో వేగం పెంచారు.

వాదనల సందర్భంగా దవే ఏమన్నారంటే…

“ఆర్మీ ఆసుపత్రి వైద్య నివేదికతో మేం విభేదించడంలేదు. అయితే ఆర్మీ ఆసుపత్రి నివేదికలో రఘురామ గాయాలకు గల కారణాలు లేవు. జీజీహెచ్ నివేదిక కూడా సరైనదే. గతంలో చోటుచేసుకున్న గుజరాత్ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలి. హైకోర్టులో ఇంకా మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో ఎలా పిటిషన్ దాఖలు చేస్తారు? బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లమని హైకోర్టు ఆయనకు చెప్పింది. కానీ, ఎంపీనంటూ బైపాస్ లో సుప్రీంకు వచ్చారు. ఎంపీ అయినంత మాత్రాన అది ఎలా సాధ్యమవుతుంది?”

“రఘురామ రెండు వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అన్ని హద్దులను మీరి ప్రవర్తించారు. కరోనా వేళ ఇదంతా సరికాదని సమయం ఇచ్చాం. ఎంపీకి చెందిన 45 వీడియోలను సేకరించిన సీఐడీ ప్రాథమిక విచారణ చేసింది. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి రేపేందుకు యత్నించారు. ఇవన్నీ రాజద్రోహం కిందకే వస్తాయి. రఘురామ తాను ఎంపీనని పదేపదే చెబుతున్నారు… ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. రఘురామకృష్ణరాజు ఎంపీ అని రోహాత్గీ పదేపదే చెబుతున్నారు… చట్టం అందరికీ ఒక్కటే” అని తెలిపారు.

ఈ సందర్భంగా న్యాయస్థానం జోక్యం చేసుకుని… రఘురామ కాలి వేలికి అయిన ఫ్రాక్చర్ గురించి ఏంచెబుతారని ప్రశ్నించింది.

అందుకు దవే బదులిస్తూ…

“ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకెళతామంటే ఎంపీ నిరాకరించారు. సొంత కారులోనే ఆసుపత్రికి వెళ్లారు. కారులో ఓవైపు అభివాదం చేస్తూ, మరోవైపు కాలి గాయాలు చూపారు. రఘురామను టార్చర్ చేయాలని పోలీసులు భావిస్తే కాలి రెండో వేలునే లక్ష్యంగా చేసుకుని ఎలా కొడతారు? ఎంపీ స్థాయి వ్యక్తి విషయంలో పోలీసులు ఎప్పటికీ అలా చేయరు. పైగా వైద్య నివేదికలో ఫ్రాక్చర్ పై అస్పష్టత ఉంది. అది కొత్తదా, పాతదా అనేది తెలియడంలేదు. గత ఎక్స్ రే రిపోర్టుల్లో ఫ్రాక్చర్ లేదు. ఎక్స్ రే రిపోర్టులు అబద్ధం చెప్పవు. ఆ ఫ్రాక్చర్ తర్వాత అయిందే. రఘురామ సీబీఐ విచారణ కోరుతున్నారు… సీబీఐ విచారణ కోరేంత అత్యవసరం ఏముంది? రఘురామ ఆసుపత్రిలో ఉన్నందున విచారణ ఈ నెల 25కి వాయిదా వేయండి” అంటూ సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.

కాగా, తన వాదనల సందర్భంగా దవే… భీమా కోరేగావ్ కుట్ర కేసు ప్రొసీడింగ్స్ ను కూడా ప్రస్తావించారు. మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశం పాటించలేదని హైకోర్టు ధిక్కరణ నోటీసు ఇవ్వడం సరికాదన్నారు.

Related posts

నిమిషాల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు.. చిగురుటాకులా వణికిన టర్కీ.. 15 మంది మృతి!

Drukpadam

బీఆర్ యస్ ,కాంగ్రెస్ లమధ్య ఉచిత విద్యుత్ పై కొనసాగుతున్న మాటల యుద్ధం …

Drukpadam

మంచు తో కప్పు బడ్డ కెనడా

Drukpadam

Leave a Comment