కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ గుర్రం అంత్యక్రియల్లో పాల్గొన్న వందలాది మంది..
కర్ణాటకలో ఘటన
చర్యలు తీసుకుంటామన్న హోంమంత్రి
దేవతా గుర్రంగా స్థానికుల నమ్మకం
కరోనా తో దేశం అతలాకుతలమౌతున్న వేళ కర్ణాటకలో వందలాది మంది ఒకదగ్గర కూడటం విమర్శలకు తావిచ్చింది. అందులో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న కర్ణాటక లో కావడం మరింత ఇబ్బందిగా మారింది. అదికూడా ఒక గుర్రం చనిపోతే జరిగిన అంత్యక్రియలకు కావడం విశేషం .
కరోనా విజృంభణ నేపథ్యంలో సొంత కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు కూడా రాలేకపోతోన్న రోజులివి. మనుషులు చనిపోతే అతి తక్కువ మందితోనే అంత్యక్రియలు పూర్తి చేసేందుకు అనుమతి ఉంది. అటువంటిది ఓ గుర్రం చనిపోతే వందలాది మంది కలిసి కరోనా నిబంధనలు పాటించకుండా అంత్యక్రియలు చేశారు. కర్ణాటకలోని బెళగావిలోని మరాడిమట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనపై కర్ణాటక హోం శాఖ మంత్రి బసవరాజ్ స్పందిస్తూ… జిల్లా అధికారులు ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నారని, నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, బెళగావిలోని మరాడిమట్ ప్రాంతంలోని ఓ ఆశ్రమంలో సిద్ధేశ్వర మఠానికి చెందిన ఆ గుర్రాన్ని దేవతా అశ్వంగా గ్రామస్థులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే దాని అంత్యక్రియలకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు