- పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు
- ఏకపక్షంగా అధ్యక్షులను మార్చినట్లు ఆరోపణ
- నిరసనలో పాల్గొన్న ఆర్మూర్, బాల్గొండ, బోధన్ మండలాల కార్యకర్తలు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీరును నిరసిస్తూ జిల్లాకు చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేశారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో బైఠాయించి అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరవింద్ ఏకపక్షంగా పలు మండలాలకు చెందిన అధ్యక్షులను మార్చినట్లు వారు ఆరోపించారు. ఆర్మూర్, బాల్కొండ, బోధన్ మండలాలకు చెందిన కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు.
పార్టీ కోసం మొదటి నుండి పని చేస్తోన్న వారికి అరవింద్ అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. మార్చిన మండలాల అధ్యక్షులను తిరిగి నియమించాలని వారు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. పార్టీ అధ్యక్షుడితో సమావేశం ఏర్పాటు చేస్తామని నేతలు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.