Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

కేసీఆర్.. నిన్ను దేవుడు అందుకే పుట్టించాడని అన్నావు కదా?: కిషన్ రెడ్డి

  • రైతులు వద్దనే వరకు ఎరువులు ఉచితంగా ఇస్తానని చెప్పాడని గుర్తు చేసిన కిషన్ రెడ్డి
  • కేంద్రం రూ.1063 ఇస్తుంటే కేసీఆర్ కనీసం రూ.260 ఎందుకివ్వడం లేదని ప్రశ్న
  • ప్రగతి భవన్లో ఇనుప కంచె వేసుకొని, బుల్లెట్ ప్రూఫ్ కిటికీ అద్దాలతో పాలన

రైతుల కోసం సీఎం కేసీఆర్ గతంలో చేసిన ప్రకటనను చూసి ఏం చెబుతాడో అని అందరం చూశామని, అప్పుడు ఆయన మాట్లాడుతూ రైతులు వద్దనే వరకు ఉచిత ఎరువులు అందిస్తామని కీలక ప్రకటన చేశారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తాను ప్రకటించేది విని ప్రపంచం ఆశ్చర్యపోతుందని, దేశం కిందమీద అవుతుందని, భూమి బద్దలు అవుతుందని, ఈ దేవుడు నన్ను ఇందుకే పుట్టించాడేమో.. అని ఆ రోజు కేసీఆర్ అన్నారని, అలా చెబుతూ రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. 

అయ్యా కేసీఆర్ గారు.. దేవుడు నిన్ను అందుకే పుట్టించాడని అన్నావు కదా.. రైతులకు ఉచితంగా ఎరువులు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. అసలు మోదీ ప్రభుత్వం ఎరువులపై పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తోందని, మీరు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు.

యూరియాపై కేంద్రం రూ.1,063 రైతుల తరఫున భరిస్తోందని, కేసీఆర్ మరో రూ.260 ఇస్తే ఉచితం అవుతుందని, మరి కేంద్రం అంత పెద్ద మొత్తం ఇచ్చినప్పుడు తక్కువ మొత్తం ఉచితంగా మీరు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కేసీఆర్ పుట్టింది రైతులను మోసం చేయడానికేనని దీంతో తేలిపోయిందన్నారు. ప్రతి సంవత్సరం 24 లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా ఇస్తానని కేసీఆర్ ఆరేళ్ల క్రితం హామీ ఇచ్చి, ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. 

అన్నదాతల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం చేసిన సందర్భంగా శామీర్‌పేట్ పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.

ఈ రోజు కల్వకుంట్ల కుటుంబం ప్రగతి భవన్‌లో పోలీసులను పెట్టుకొని, ఇనుప కంచె వేసుకొని, కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకొని పాలిస్తున్నారని, కానీ ఇది ప్రజాపరిపాలన కాదన్నారు. అది ప్రగతి భవన్ కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే దీనిని ప్రజా ప్రగతి భవన్ లా మారుస్తామని హామీ ఇచ్చారు. పాలనలో తానే సమర్థుడినని కేసీఆర్ చెబుతున్నారని, కానీ ఈ తొమ్మిదేళ్లలో మహిళా మంత్రి లేని ప్రభుత్వాన్ని, అవినీతి పరిపాలనను, రైతులను, ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసిన పరిపాలనను చూశామని, ఇక కేసీఆర్ పాలనను మరోసారి చూడాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ ను ఇక చాలు అని ప్రజలు అంటున్నారన్నారు. మోదీ ఆధ్వర్యంలో రైతుకు మేలు చేసే ప్రభుత్వాన్ని తీసుకు వస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిజమైన రైతు రాజ్యం ఏర్పాటు చేస్తామన్నారు.

Related posts

బీఆర్ఎస్‌ పార్టీలో విజయవాడ మాజీ మేయర్…

Drukpadam

1 ,2 ,3 ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పరిపాలన మంత్రి బొత్స…

Drukpadam

లాఖిమ్ పూర్ లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి వాహనం: వ‌రుణ్ గాంధీ!

Drukpadam

Leave a Comment