- ఖనిజ లవణాల నిల్వల్లో చిక్కుకుపోయిన నీటి బిందువులు
- విశ్లేషించిన శాస్త్రవేత్తలు
- ఆ నీటి బిందువుల చరిత్ర ఇప్పటిది కాదని వెల్లడి
సంవత్సరంలో 365 రోజులూ మంచుతో కప్పబడి ఉండే హిమాలయాల్లో మహాసముద్రం ఆనవాళ్లు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. సుమారు 60 కోట్ల సంవత్సరాల కిందట హిమాలయాలు ఉన్న ప్రాంతం ఓ మహాసముద్రం అని భారత్, జపాన్ దేశాలకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ఈ మంచు పర్వతాల్లోని ఖనిజ లవణాల నిల్వల్లో చిక్కుకుపోయిన నీటి బిందువులను విశ్లేషించడం ద్వారా వారు ఈ విషయాన్ని గుర్తించారు.
బెంగళూరుకు చెందిన ఐఐఎస్ సీ (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్), జపాన్ కు చెందిన నిగటా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. హిమాలయాల్లో లభించిన కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం కార్బొనేట్ ను విశ్లేషించగా, భూమండలంపై ఒకప్పుడు గొప్ప ఆక్సీజనీకరణ ప్రక్రియ చోటుచేసుకుందన్న విషయం వెల్లడైంది. దీనికి సంబంధించిన అధ్యయనం ప్రికేంబ్రియన్ రీసెర్చ్ పేరిట ప్రచురితమైంది.
పరిశోధనకు సంబంధించి బెంగళూరు ఐఐఎస్ సీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటన మేరకు… సుమారు 600 మిలియన్ సంవత్సరాల కిందట దట్టమైన మంచు ఫలకాలతో భూమి కప్పబడి ఉండేది. ఆ సమయంలో భూమి ఒక మంచు బంతిలా కనిపించేది. ఈ క్రమంలోనే భూమండలంపై ఆక్సిజన్ పరిమాణం అధికం కావడంతో, జీవరాశి పరిణామ క్రమానికి అదే నాంది పలికింది.
అయితే, అంతరించిపోయిన ప్రాచీన మహాసముద్రాలు, శిలాజాలను సరిగా భద్రపరచకపోవడం వంటి కారణాల వల్ల భూగోళంపై ఏర్పడిన పరిణామాల మధ్య లింకులను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు హిమాలయాల నుంచి బయటపడిన సముద్ర శిలల నుంచి కొంతమేర సమాచారం రాబట్టవచ్చని ఐఐఎస్ సీ పేర్కొంది.
ప్రాచీన మహాసముద్రాలకు, ఇప్పటి మహాసముద్రాలకు తేడాలు తెలుసుకోవాల్సి ఉందని ఐఐఎస్ సీ పీహెచ్ డీ విద్యార్థి ప్రకాశ్ చంద్ర ఆర్య తెలిపారు. వాటిలో లవణీయత శాతం ఎంత, అవి ఆమ్లత్వం కలిగి ఉండేవా, క్షారత్వం కలిగి ఉండేవా, ఆ నీరు ఖనిజ లవణాలతో కూడినదా, కాదా, ఆ నీటి రసాయన, ఐసోటోపిక్ కాంబినేషన్ ఏంటనేది తెలియాల్సి ఉందని వివరించారు. వీటన్నింటిపై స్పష్టత వస్తే అప్పట్లో భూ వాతావరణం ఎలా ఉండేదన్న విషయంపై అవగాహన ఏర్పడుతుందని వెల్లడించారు.