- మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉనికిని పెంచేలా కేసీఆర్ కార్యాచరణ
- వటేగావ్ లో అన్న బాపు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న కేసీఆర్
- కేటీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ లో పలువురు చేరే అవకాశం
బీఆర్ఎస్ ను జాతీయ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో పలు భారీ బహిరంగ సభలను ఆయన నిర్వహించారు. మహారాష్ట్రలోని ఆలయాలను సందర్శిస్తున్నారు. చివరి సారి దాదాపు 600 వాహనాల కాన్వాయ్ తో మహారాష్ట్రకు కేసీఆర్ వెళ్లడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉనికిని పెంచేలా ఆయన కార్యాచరణ కొనసాగుతోంది.
తాజాగా మరోసారి ఆయన మహారాష్ట్రకు పయనమయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి కాసేపటి క్రితం ప్రత్యేక విమానంలో ఆయన కొల్హాపూర్ కు బయల్దేరారు. కొల్హాపూర్ లో అంబా బాయిగా భక్తులు కొలుచుకునే మహాలక్ష్మిదేవి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
అనంతరం సాంగ్లి జిల్లాలోని వటేగావ్ కు చేరుకుంటారు. అక్కడ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త అన్న బాపు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనేక సామాజిక ఉద్యమాలకు అన్న బాపు నాయకత్వం వహించి, ప్రజల్లో ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా అన్న బాపు ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులతో భేటీ అవుతారు. అలాగే, అన్న బాపు కుటుంబ సభ్యులతో పాటు పలువురు బీఆర్ఎస్ లో చేరుతారని చెపుతున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగిస్తారు.
ఆ తర్వాత ఇస్తాంపూర్ లోని షేత్కారి సంఘటన్ నేత రఘునాథ్ దాదా పాటిల్ నివాసంలో కేసీఆర్ భోజనం చేస్తారు. అనంతరం కొల్హాపూర్ కు చేరుకుని, అక్కడున్న సాధు మహారాజ్ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత కొల్హాపూర్ విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకుంటారు.