ఏపీ విభజన బిల్లుపై సుప్రీంకోర్టులో విచారణ… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
-ఏపీ విభజన బిల్లు చట్టబద్ధంగా ఆమోదం పొందలేదంటూ పిటిషన్
-నేడు విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు
-వాదనలు వినిపించిన ఉండవల్లి అరుణ్ కుమార్
-అశాస్త్రీయంగా విభజన చేశారని వాదన
-ఇది రాజకీయ అంశం ..మేమెందుకు జోక్యం చేసుకోవాలి? అంటూ ప్రశ్నించిన సుప్రీం…
ఏపీ విభజన బిల్లుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది ఎవరికి సంబంధించిన విషయం? అంటూ పిటిషనర్ ను ప్రశ్నించింది. ఏపీ విభజన బిల్లు చట్టబద్ధంగా పార్లమెంటులో ఆమోదం పొందలేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ ఆసక్తిగా జరిగింది..న్యాయమూర్తులు దీనిపై స్పందిస్తూ ఇది రాజకీయ అంశం దీనిపై మేమెందుకు జోక్యం చేసుకోవాలి అని వ్యాఖ్యానించింది …
ఈ పిటిషన్ పై నేడు విచారణ కొనసాగగా… కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపించారు. పార్లమెంటు తలుపులు మూసివేసి, లోక్ సభ ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసి, అశాస్త్రీయ రీతిలో విభజన చేశారని వివరించారు. నాడు ఎంపీగా ఉన్న తనను కూడా సభ నుంచి బయటికి పంపించివేశారని వెల్లడించారు. సుదీర్ఘ సమయం పాటు చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని, అరగంటలో తేల్చేశారని సుప్రీం ధర్మాసనానికి ఉండవల్లి అరుణ్ కుమార్ విన్నవించారు.
పిటిషనర్ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం… ఇది రాజకీయ సమస్య అయినప్పుడు మేమెందుకు జోక్యం చేసుకోవాలి? అని ప్రశ్నించింది. ఇది పార్లమెంటుకు సంబంధించిన విషయం… ఇంతకుమించి ఈ కేసులో ఇంకేముంది? అని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి కేసులు చాలానే పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది.
విభజన తీరును వ్యతిరేకిస్తూ ఉండవల్లి, మరో 20 మంది అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.